Begin typing your search above and press return to search.

స్టార్ ప్రొడ్యూస‌ర్ ఈసారైనా స‌త్తా చాటుతారా?

By:  Tupaki Desk   |   17 Jun 2022 12:10 PM
స్టార్ ప్రొడ్యూస‌ర్ ఈసారైనా స‌త్తా చాటుతారా?
X
టాలీవుడ్ లో అన‌తి కాలంలోనే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ల‌తో నిర్మాత‌గా మంచి గుర్తింపుతో పాటు త‌న‌దైన ముద్ర‌ని వేసిన స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు. ప్రేక్ష‌కుల నాడి తెలిసిన నిర్మాత‌గా ఇండ‌స్ట్రీలో ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఒక ద‌శ‌లో రికార్డు స్థాయి స‌క్సెల్ ల‌ని సాధించి టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచారు కూడా. తెలుగులో స్టార్ ప్రొడ్యూస‌ర్ గా పేరు తెచ్చుకున్న ఆయ‌న ఇప్ప‌డు పాన్ ఇండియా స్థాయి చిత్రాల నిర్మాత‌గా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవాల భావిస్తున్నారు.

ఇందు కోసం బాలీవుడ్ లోకి నిర్మాతగా ఎంట్రీ ఇవ్వాల‌ని, తొలి ప్ర‌య‌త్నంగా ఓ సూప‌ర్ హిట్ మూవీతో అక్క‌డి వారి దృష్టిని ఆక‌ర్షించాల‌ని ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ముందు తెలుగులో సూప‌ర్ హిట్ అయిన `జెర్సీ`ని బాలీవుడ్ లో అల్లు అర‌వింద్, బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ అమ‌న్ గిల్ తో క‌లిసి నిర్మించారు. భారీ అంచ‌నాల‌తో షాహీద్ క‌పూర్ తో నిర్మించిన ఈ రీమేక్ మూవీ దిల్ రాజు ఆశ‌ల‌ని ఆవిరి చేసింది. బాక్సాఫీస్ వ‌ద్ద తెలుగు సినిమాని మించి విజ‌యాన్ని సాధిస్తుంద‌ని భావించిన ఈ మూవీ భారీ ఫ్లాప్ గా నిలిచి తీవ్ర నిరాశ‌కు గురిచేసింది.

ఈ నేప‌థ్యంలో దిల్ రాజు మ‌రో తెలుగు స‌క్సెస్‌ మూవీ రీమేక్ తో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్నారు. తెలుగులో హీరో విశ్వ‌క్ సేన్ న‌టించిన చిత్రం `హిట్`. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని శైలేష్ కొల‌ను తెర‌కెక్కించాడు. విభిన్న‌మైన పంథాలో రూపొందిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించింది. ఇదే సినిమాని `హిట్: ద ఫ‌స్ట్ కేస్‌` పేరుతో హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా టి సిరీస్ తో క‌లిసి దిల్ రాజు రీమేక్ చేశారు.

శైలేష్ కొల‌ను డైరెక్ట్ చేసిన ఈ హిందీ రీమేక్‌ జూలై 15న వ‌రల్డ్ వైడ్ గా థియేట‌ర్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం ఈ మూవీ టీజ‌ర్ ని మేక‌ర్స్ విడుద‌ల చేశారు. సాన్యా మ‌ల్హోత్రా హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీ టీజ‌ర్ ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. విశ్వ‌క్ సేన్ పాత్ర‌లో రాజ్ కుమార్ రావు న‌ట‌న ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాతో దిల్ రాజు బాలీవుడ్ లో ఖాతా తెరిచేలా టీజ‌ర్ క‌నిపిస్తోంది. ఈ మూవీ త‌రువాత దిల్ రాజు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ బోనీ క‌పూర్ తో క‌లిసి `ఎఫ్ 2`ని కూడా హిందీలో రీమేక్ చేయ‌బోతున్నారు.

`హిట్: ద ఫ‌స్ట్ కేస్‌` రిజ‌ల్ట్ ఇప్ప‌డు `ఎఫ్ 2` రీమేక్ కు అత్యంత కీలకంగా మారింది. అంతే కాకుండా తెలుగులో స్టార్ ప్రొడ్యూస‌ర్ గా భారీ విజ‌యాల్ని త‌న ఖాతాలో వేసుకున్న దిల్ రాజు బాలీవుడ్ కెరీర్ పై కూడా ఓ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తోంది.