Begin typing your search above and press return to search.

OTT లో బాహుబ‌లి- ట్రాయ్ లాంటి వారియ‌ర్ మూవీ

By:  Tupaki Desk   |   8 Aug 2021 11:39 AM GMT
OTT లో బాహుబ‌లి- ట్రాయ్ లాంటి వారియ‌ర్ మూవీ
X
క‌రోనా క్రైసిస్ విజృంభ‌న వినోద‌ప‌రిశ్ర‌మ‌కు స‌రికొత్త పాఠాలు నేర్పింది అనే కంటే సినిమా వీక్ష‌కుల‌కు గొప్ప పాఠం నేర్పింది అన‌డం స‌ముచితం. 90ల‌లో తెలుగు సినీప‌రిశ్ర‌మ ప‌రిధి ఎంత‌గా కుంచించుకుపోయి ఉండేదో ఇప్పుడు అంత విస్త‌రించ‌డం గొప్ప ఎదుగుద‌ల అని భావిస్తే ఓటీటీ రంగ ప్ర‌వేశం అనేది దానిని వంద రెట్లు పెంచ‌డంగా భావించాలి. రొటీనిటీకి భిన్నంగా ఎవ‌రికి న‌చ్చిన రుచులు వారు ఆస్వాధించే మార్గాన్ని ఓటీటీ సుగ‌మం చేసింది. ఇన్నాళ్లు థియేట‌ర్ల‌కు వెళితే అక్క‌డ వారు ఏం చూపిస్తే అదే చూడాలి. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రేక్ష‌కుల‌కు ఎంచుకోవ‌డానికి వంద ఆప్ష‌న్లు ఉన్నాయి. ఎవ‌రో ఏదో చూపిస్తే చూడాల్సిన క‌ర్మ ఏం లేదు. ఫ‌లానా జాన‌ర్ న‌చ్చుతుంది అనుకుంటే ఆ జానర్ సినిమాలు వీక్షించుకునే వెసులుబాటు పుష్క‌లంగా ఉంది.

OTT క్ర‌మ‌క్ర‌మంగా భారతదేశంలో వేగంగా విస్తరిస్తోంది. వీక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ప్రతి స్ట్రీమింగ్ ప్లాట్ ఫారమ్ ఎవ‌రికివారు సొంత‌ వ్యూహాలను రూపొందిస్తూ ముందుకు సాగుతున్నారు. యూనిక్ కంటెంట్ తో ఆక‌ర్షించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అమెజాన్ - నెట్ ఫ్లిక్స్ లాంటివి ఇప్ప‌టికే త‌మ ఆధిప‌త్యాన్ని చాటుకుంటున్నాయి. ఇప్పుడు రేసులోకి డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ వ‌చ్చి చేరింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన వెబ్ సిరీస్ తో హాట్ స్టార్ స‌వాల్ విస‌ర‌బోతోంది. `ది ఎంపైర్` పేరుతో చ‌రిత్ర‌ను మొఘ‌ల్ సామ్రాజ్య వైభ‌వాన్ని యుద్ధాల చ‌రిత్ర‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తోంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ విడుద‌లైంది.

``రాజు తన రాజ్యం కోసం విధి కోసం కుటుంబం కోసం మరణం వ‌ర‌కూ తనకు తానుగా పోరాడుతున్న కథ`` అన్న డైలాగ్ తో విరోచిత ఘ‌ట్టాల‌ను ఆవిష్క‌రించిన తీరు అద్భుతం అనిపిస్తుంది. అన్ని ఎపిసోడ్ లు ఆగష్టు 27 నుండి ప్రసారం కానున్నాయి. మొఘల్ సామ్రాజ్యం పెరుగుదల పతనం సామ్రాజ్య విస్త‌ర‌ణ ప్ర‌తిదీ ఇందులో చూపించ‌నున్నారు. ఇది బాబర్ తరం నుండి ఔరంగజేబు వరకు విస్త‌రించిన క‌థాంశం. మొట్టమొదటి సీజన్ లో బాబర్ కథను చూపిస్తారు. చ‌క్ర‌వ‌ర్తి బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని దేశంలో అత్యంత శక్తివంతమైనదిగా ఎలా త‌యారు చేశాడు? అన్న కోణంలో సాగుతుంది. బాబర్ పాత్రలో కునాల్ కపూర్ నటించగా సీనియర్ నటి షబానా ఆజ్మీ ఈసాన్ దౌలత్ గా కనిపించనున్నారు. దష్టి ధామి- ఆదిత్య సీల్ - డినో మోరియా వరుసగా ఖంజాదా బేగం- హుమయూన్ - షైబానీ ఖాన్ పాత్రలను పోషించారు.

హాలీవుడ్ ఆస్కార్ ల మూవీ ట్రాయ్ రేంజులో విజువ‌ల్స్ అబ్బుర‌ప‌రుస్తున్నాయి అంటే అతిశ‌యోక్తి కాదు. బాహుబ‌లి .. ట్రాయ్ సినిమాల తీరు తెన్నులు ఈ సిరీస్ లో క‌నిపించ‌నున్నాయి. గొప్ప ఎమోష‌న్ ఘ‌ర్ష‌ణ క‌థ‌తో పాటు యుద్ధాలు ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నున్నాయ‌ని అర్థ‌మ‌వుతోంది. భారీ సెట్ లు అద్భుతంగా కనిపిస్తాయి. భార‌తీయ సిరీస్ ల‌లో ఇంతటి స్థాయి ప్రదర్శనను మ‌నం ఇదివ‌ర‌కూ ఎన్నడూ చూడలేదు. బహుశా ఇది ఇండియన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కావచ్చన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నిఖిల్ అద్వానీ ఈ సిరీస్ ని రూపొందించారు. ది ఎంపైర్ ఆగస్టు 27 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇది హిందీ- తెలుగు- తమిళం- కన్నడ- మలయాళం- బంగ్లా -మరాఠీ భాషలలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా తెలుగు వెర్ష‌న్ ని ఆస్వాధించేందుకు రెడీ అవుతోంది కాబ‌ట్టి ఫ్యామిలీమ్యాన్ రేంజులోనే ఈ సిరీస్ పాపుల‌ర‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.