Begin typing your search above and press return to search.

రాజమౌళిని ఆకర్షించిన కొమురం భీం చరిత్రేంటి?

By:  Tupaki Desk   |   14 March 2019 9:48 AM GMT
రాజమౌళిని ఆకర్షించిన కొమురం భీం చరిత్రేంటి?
X
ఆర్ ఆర్ ఆర్.. టాలీవుడే కాదు.. బాలీవుడ్.. దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఈ మూవీ గురించి పూర్తి సమాచారం తెలిసివచ్చింది. తొలి పోస్టర్ బయటకు వచ్చింది. ఈ పోస్టర్ బట్టే ఆ వీరుల చారిత్రక గాథను రాజమౌళి చెప్పేశాడు. అల్లూరి సీతారామారాజుగా రాంచరణ్.. కొమురం భీంగా తారక్ కనిపించాడు. ఫస్ట్ లుక్ ను గమనిస్తే రాంచరణ్ సీరియస్ లుక్ లో అగ్నికి ఆజ్యం పోశాడు. అల్లూరి పోరాడిన స్వాతంత్ర్య ఉద్యమకాంక్షను ఇది తెలియజెపుతోంది. ఇక తారక్ పోస్టర్ లో నీటి సవ్వడిని ఎగజిమ్మాడు.. కొమురం భీం పోరాడింది ‘జల్.. జంగల్.. జమీన్’ కోసం.. (నీరు, భూమి, ప్రాంతం..) ఈ మూడింటిలో కొమురం భీం మొదటి పోరాడింది జల్ అంటే నీటి కోసం.. అందుకే ఈ నీటి సవ్వడిని రాజమౌళి చాకచక్యంగా వాడేశారు. చూడడానికి గంభీరంగా ఉన్నా ఆ పోస్టర్ లో ఎంతో నిగూఢ అర్థం ఉంది. నిజానికి మన్యం వీరుడిగా సూపర్ స్టార్ కృష్ణ నటించి మెప్పించాడు. ఆయనను సినిమాలో చూసుకొని అల్లూరిని పోల్చుకున్నాం. కానీ చూడనిది కొమురం భీంనే.. అందుకే అంతటి తెలంగాణ గిరిజన పోరాట యోధుడి పాత్ర సవాల్ తో కూడుకున్నది.. తెలంగాణ మాండలికాన్ని ఆవపోసన పట్టాల్సి ఉంటుంది. అందుకే ఈ పాత్రను తెలుగు హీరోలందరిలోకి యాక్టింగ్ లో నంబర్ 1 గా కనపడే తారక్ ను రాజమౌళి ఎంచుకోవడం విశేషం.

జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఇద్దరు తెలుగు పోరాట యోధుల చరిత్ర. అందులో ఒకరు తెలంగాణ పోరుబిడ్డ కొమురం భీం కాగా.. రెండో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో బ్రిటీషర్లను ఎదురించిన మన్యం వీరుడు అల్లురి సీతారామారాజు. వీరి చరిత్రను జక్కన్న తెరపై ఆవిష్కరించబోతున్నారు. ప్రపంచానికి తెలుగువీరుల చరిత్ర ఇదీ అని చాటబోతున్నారు. ఇంతకీ ఈ వీరులెవరు? వీరి చరిత్ర ఏంటి.? రాజమోళి టేకప్ చేసేంత క్యూరియాసిటీ ఈ వీరుల జీవిత చరిత్రలో ఏముందన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అల్లూరి గురించి కాస్తాకూస్తో తెలుసు.. మరి మరుగున పడిన కొమురం భీం చరిత్రలో ఏముంది.?

*కొమురం భీమ్ చరిత్ర
అది 1901 సంవత్సరం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా సంకేపల్లి గ్రామం.. కొమురం చిన్నూమ్ -సోంబాయి దంపతులకు కొమురం భీమ్ జన్మించాడు. అప్పటికే తెలంగాణపై నిజాం నవాబు సాగిస్తున్న దోపిడీ, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. భీం పిల్లాడుగా ఉన్నప్పుడు పదిహేడేళ్ల వయసులో నిజాం అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో ఆయన తండ్రి చిన్నూమ్ మరణించాడు. దీంతో భీం కుటుంబం కెరిమెరి ప్రాంతంలోని సర్ధాపూర్ కు వలసవెళ్లింది. అక్కడ అడవిని నరికి సాగు చేసుకుంటున్న భీం కుటుంబం భూమిని సిద్ధిఖీ అనే జమీందర్ ఆక్రమించాడు. ఆవేశం పట్టలేని భీమ్ సిద్ధిఖీని హతమార్చి నిజాం నవాబులు ఏమైనా చేస్తారన్న భయంతో అస్సాం పారిపోయాడు. ఐదేళ్ల పాటు కాఫీ, తేయాకు తోటల్లో పనిచేస్తూ గడిపాడు. తిరిగి ఐదేళ్ల తర్వాత కెరిమెరి చేరుకున్నాడు. నిజాం నవాబు గిరిజన పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గిరిజనులను ఒక్కతాటిపైకి నడిపించి ఉద్యమించాడు. జోడెఘాట్ గుట్టలు కేంద్రం గిరిజనులను సైన్యంగా మార్చి గెరిల్లా పోరాటాన్ని చేశాడు. నిజాం నవాబుపై తుపాకులు చేతబట్టి ముప్పుతిప్పలు పెట్టాడు. చివరకు కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహీ ఇచ్చిన సమాచారంతో 1940 అక్టోబర్ 27న జోడెఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని నిజాం సేనలు ముట్టడించి భీమ్ ను హతమర్చాయి.

ఇదీ కథ.. ఇందులో ఎంతో స్పైసీ కంటెంట్ ఉంది. కొమురం భీం ఐదేళ్లు ఎక్కడికి వెళ్లాడో తెలియదు అని రాజమౌళి అన్నాడు. ఆ ఐదేళ్లు నిజాం జమీందర్ ను చంపి అస్సాం వెళ్లిపోయాడు. ఇది నిజాం వారసులు చెబుతుంటారు. ఆ ఐదేళ్లు.. అంతకుముందు పర్యవసనాలు తెరకెక్కిస్తానని రాజమౌళి చెబుతున్నాడు. కొమురం భీం ఆదిలాబాద్ అడవి కేంద్రం పోరాడింది ఈ మూడింటి కోసమే.. జల్.. జంగల్.. జమీన్.. ఈ మూడింటి కోసమే అమరుడయ్యాడు. 39 ఏళ్ల వయసులోనే గిరిజనుల జీవితాల్లో ఎంతో ఉద్యమ స్ఫూర్తి రగిల్చి దేవుడయ్యారు. ఆ విప్లవ వీరుడి కథను నేటి తరానికి అందిస్తున్న రాజమౌళిని ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.