Begin typing your search above and press return to search.

శంకర్ కంటే ఆయన డాటర్ స్పీడ్ గా ఉందే!

By:  Tupaki Desk   |   21 Dec 2021 11:00 AM IST
శంకర్ కంటే ఆయన డాటర్ స్పీడ్ గా ఉందే!
X
గతంలో హీరోల ఫ్యామిలీ నుంచి హీరోలే వచ్చేవారు ..అలాగే హీరోయిన్స్ ఫ్యామిలీ నుంచి హీరోయిన్స్ మాత్రమే వచ్చేవారు. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. హీరోలు కూడా తమ కుమార్తెలు హీరోయిన్స్ గా పేరు తెచ్చుకోవడానికి అంగీకరిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో దర్శకులు కూడా తమ పుత్రికా రత్నాలను హీరోయిన్స్ గా చూడటానికి ఎంతమాత్రం సంకోచించడం లేదు. వాళ్ల డాటర్స్ మంచి చదువులు చదివినప్పటికీ, చిన్నప్పటి నుంచి సినిమా వాతావారణంలో పెరగడం వలన సినిమాలు చేయడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ప్రియదర్శన్ ఎంత గొప్ప దర్శకుడు అనేది అందరికీ తెలిసిందే. ఎంతటి భారీ సినిమాలనైనా అలవోకగా తీసేయడం ఆయన ప్రత్యేకత. తన సినిమాలకి సంబంధించిన విషయాలను గురించి తప్ప ఆయన మరో విషయాన్ని గురించిన ఆలోచన చేస్తున్నట్టుగా ఎక్కడా కనిపించరు. అలాంటి ప్రియదర్శన్ కూడా సినిమాల్లో నటించడానికి తన కూతురు కల్యాణికి ఎంతో స్వేచ్ఛను ఇచ్చారు.

దాంతో ఆమె నటిగా తనని తాను నిరూపించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ వెళుతోంది. ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద ప్రాజెక్టులలో అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళుతోంది. ఆ జాబితాలోనే శంకర్ కూతురు అదితి కూడా చేరిపోయింది.

సౌత్ సినిమా భారీ తనాన్ని ప్రపంచపటానికి పరిచయం చేసిన దర్శకుడు శంకర్. బలమైన కథాకథనాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి, ఉత్తరాది సినిమాలకంటే ముందుగా సౌత్ సినిమాను నడిపించినవారాయన.

అలాంటి శంకర్ కూడా, తన కూతురు అదితి సినిమాల్లోకి రావడానికి అభ్యంతర పెట్టలేదు. అయితే ముందుగా చదువు పూర్తి చేసిన తరువాతనే ఆయన తన కూతురు సినిమాల్లోకి రావడానికి అనుమతించారు. ఇటీవలే ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ గా పట్టా అందుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఆమె తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

హీరోయిన్ గా ఆమె కార్తి సినిమా 'విరుమాన్'తో పరిచయమవుతోంది. ఈ సినిమాను సూర్య నిర్మిస్తూ ఉండగా, ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నాడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా చకచకా షూటింగ్ జరుపుకుంటూ ఉండగానే, ఆమె మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

'కరోనా కుమార్' అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాలో హీరో .. శింబు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి గోకుల్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం గౌతమ్ మీనన్ సినిమాతో బిజీగా ఉన్న శింబు, అది పూర్తికాగానే కొత్త ప్రాజెక్టుపైకి రానున్నాడు. అదితి స్పీడ్ చూస్తుంటే .. త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను చక్కబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో తండ్రి డైరెక్షన్లో కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదేమో!