Begin typing your search above and press return to search.

'బాహుబలి'లో ఏ క్యారెక్టర్‌ హైలైట్‌ అవుతుంది?

By:  Tupaki Desk   |   9 July 2015 3:36 PM IST
బాహుబలిలో ఏ క్యారెక్టర్‌ హైలైట్‌ అవుతుంది?
X
ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ మోషన్‌ పిక్చర్‌ ఇంకొన్ని గంటల్లో విడుదల కాబోతోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే షోలు పడిపోతున్నాయి. సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వెండితెర మీద ఓ అద్భుతాన్ని చూడబోతున్నామనే ప్రతి ప్రేక్షకుడూ ఆశిస్తున్నాడు. సినిమాలోని క్యారెక్టర్ల గురించి.. విజువల్‌ గ్రాండియర్‌ గురించి చాలా చెప్పింది రాజమౌళి అండ్‌ కో. సినిమాలోని ప్రధాన పాత్రల పేర్లన్నీ ఇప్పటికే ప్రేక్షకులకు కంఠతా వచ్చేశాయి.

బాహుబలిగా లీడ్‌ రోల్‌ చేస్తూనే.. అతడి కొడుకు శివుడి పాత్రలోనూ కనిపించబోతున్నాడు ప్రభాస్‌. కెరీర్లో తొలిసారి అతను ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. తొలి పార్ట్‌లో శివుడు పాత్రే హైలైట్‌ కాబోతోందని ట్రైలర్‌ను బట్టి చూస్తే అర్థమవుతోంది. రానా వేసిన విలన్‌ క్యారెక్టర్‌ భల్లాలదేవుడి గురించి అతడితో పాటు రాజమౌళి కూడా ఎంతో గొప్పగా చెప్పాడు. గత కొన్ని దశాబ్దాల్లో తెలుగు తెరపై ఇలాంటి విలన్‌ పాత్రే రాలేదంటున్నాడు. రాజమౌళి సినిమాల్లో ఇప్పటిదాకా వచ్చిన విలన్‌ క్యారెక్టర్లు కూడా దీని ముందు తేలిపోతాయని అంటున్నాడు. రానా.. ప్రభాస్‌ను డామినేట్‌ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంచనాలున్నాయి.

ఇక రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర గురించి కూడా చాలా చర్చే జరిగింది. అసలు బాహుబలి సినిమా పుట్టిందే ఈ పాత్ర నుంచి అని.. ఇంత పవర్‌ఫుల్‌ లేడీ క్యారెక్టర్‌ ఇండియన్‌ సినిమాలోనే లేదని అంటున్నారు. నరసింహలో నీలాంబరి పాత్ర కంటే రమ్యకృష్ణకు ఇది గొప్ప క్యారెక్టర్‌ అవుతుందని చెబుతున్నారు. అవంతికగా తమన్నా కూడా తెరపైన షాక్‌ ఇవ్వబోతోందంటున్నారు. అనుష్క 'దేవసేన'గా షాకింగ్‌ అవతారంలో దర్శనమివ్వబోతోంది. ఐతే తొలి పార్ట్‌లో ఆమె పాత్ర కనిపించేది తక్కువంటున్నారు. ఇంకా నాజర్‌ పోషించిన బిజ్జాల దేవ, సత్యరాజ్‌ చేసిన కట్టప్ప పాత్రలు కూడా ఆసక్తి రేపుతున్నాయి. సినిమాకు ప్రాణం ఈ ఎనిమిది పాత్రలే. మరి ఈ ఎనిమిదిలో ఏ పాత్ర అన్నింటికన్నా హైలైట్‌ అవుతుందో చూడాలి.