Begin typing your search above and press return to search.

సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా నష్టపోయేది వారే...!

By:  Tupaki Desk   |   15 May 2020 8:50 PM IST
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా నష్టపోయేది వారే...!
X
ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్తంగా మారిపోయింది. కరోనా మహమ్మారి అన్ని రంగాల మీద తన ప్రభావాన్ని చూపించింది. కరోనా ప్రభావం ఎక్కువగా పడిన రంగాల్లో సినీరంగం ఒకటి అని చెప్పవచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే కరోనా ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై వచ్చే ఏడాది చివరి వరకు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. దీని వల్ల నిరుద్యోగిత రేటు కూడా పెరిగే అవకాశాలున్నాయి. దీంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దీనికి సినిమా రంగం కూడా మినహాయింపు కాదు. ముఖ్యంగా సినిమా మీద ఆధారపడుతున్న చాలా మందికి వచ్చే రెమ్యూనరేషన్ లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

చిత్ర పరిశ్రమ మూత పడడంతో నిర్మాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమాలను నిర్మించిన నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో నిర్మాతలు విరివిగా డబ్బులు ఖర్చు చేసి సినిమాలు తీసే పరిస్థితి కనిపించడం లేదు. ఇకపై బడ్జెట్ విషయంలో కచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా కరోనా ప్రభావం తగ్గి లాక్ డౌన్ ఎత్తేసినా జనాల్ని థియేటర్లకు రప్పించడం అంత తేలికైన విషయం కాదని చెప్పవచ్చు. దీంతో నిర్మాత పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. అందువల్ల ఇప్పటి నుంచి నిర్మాతలు ఆచితూచి అడుగులు వేసే ఛాన్స్ ఉంది. ఇకపై ఖచ్చితంగా ఖర్చు తగ్గించుకునే మార్గాలని వెతుక్కోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.

అంతేకాకుండా సినిమా బడ్జెట్ లో కోతలు ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సాధారణంగా సినిమా బడ్జెట్ లో ఎక్కువ భాగం డైరెక్టర్, టెక్నీషియన్స్ హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్ కే కేటాయిస్తున్నారు. దీంతో ముఖ్యంగా భారీ రెమ్యూనరేషన్ తీసుకునే వీళ్లు పారితోషకాల్లో కోతలు విధిస్తే నిర్మాత అంతో ఇంతో కోలుకునే అవకాశం ఉంది. కానీ నిర్మాతలు ఈ మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో హీరోలను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని అడిగే సాహసం చేయలేరు. ఎందుకంటే హీరోలు సినిమాని తమ భుజాన వేసుకొని.. వారి పేరు మీదనే మార్కెట్ చేస్తూ ఉంటారు. అందువల్ల హీరోలను నిర్మాతలు అడగలేరు. వారికై వారు స్వచ్చంధంగా ముందుకు వచ్చి పారితోషకాల్లో కోతలు విదించుకోవాల్సిందే. కాకపోతే హీరోలు తీసుకునే దానిలో కేవలం 10 శాతం రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ టెక్నిషియన్స్ ని మాత్రం తగ్గించుకోమని నిర్మాతలు అడిగే అవకాశం ఉంది.

కొంతమంది హీరోయిన్ల పేరు మీదుగా సినిమాల మార్కెట్ జరుగుతున్నప్పటికీ హీరోల రేంజ్ లో అయితే మార్కెట్ చేయలేరు అని చెప్పొచ్చు. అందువల్ల కరోనా లాక్ డౌన్ తర్వాత హీరోయిన్స్ టెక్నిషియన్స్ రెమ్యూనరేషన్స్ లో కోతలు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతేకాకుండా సినిమా మీద ఆధారపడి జీవిస్తున్న చాలా కుటుంబాల పరిస్థితి కూడా ఇలానే ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ హీరోయిన్స్ పారితోషకాల విషయంలో పెట్టుబడితో తక్కువ బడ్జెట్ లో వచ్చే కొత్త హీరోయిన్స్ వైపు నిర్మాతల చూపు పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తం మీద రాబోయే రోజుల్లో హీరోయిన్స్ టెక్నిషియన్స్ గడ్డుకాలం ఎదుర్కోనున్నారని చెప్పవచ్చు.