Begin typing your search above and press return to search.

'భోళా శంకర్' లో మెగాస్టార్ కు హీరోయిన్ ఫిక్స్..!

By:  Tupaki Desk   |   9 Nov 2021 7:46 AM GMT
భోళా శంకర్ లో మెగాస్టార్ కు హీరోయిన్ ఫిక్స్..!
X
మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు మెహర్ రమేష్‌ కాంబినేషన్ లో ''భోళా శంకర్'' అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఇది తమిళ్ లో ఘన విజయం సాధించిన ‘వేదాళమ్’ చిత్రానికి అధికారిక రీమేక్‌. అన్నాచెల్లెళ్ల బంధం చుట్టూ తిరిగే ఈ కథలో చిరు సోదరిగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ కనిపించనుంది. ఈ క్రమంలో తాజాగా చిరంజీవి సరసన నటించే హీరోయిన్‌ ని అధికారికంగా ప్రకటించారు.

''భోళా శంకర్'' సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ను హీరోయిన్ గా తీసుకున్నట్లు మేకర్స్ మంగళవారం ఉదయం వెల్లడించారు. ఈ సందర్భంగా తమన్నా ట్వీట్ చేస్తూ.. ''మెగా మాసివ్ మూవీ 'భోలాశంకర్‌' లో భాగమైనందుకు గౌరవంగా ఆనందంగా ఉంది. మరోసారి చిరంజీవి సార్‌ తో స్క్రీన్‌ పంచుకోవడానికి వేచి ఉండలేను. మెహర్ రమేష్ గారూ దీన్ని త్వరగా తీసుకురండి'' అని పేర్కొన్నారు.

ఇంతకముందు 'సైరా నరసింహా రెడ్డి' సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ఈ జంట తెరపై సందడి చేయనున్నారు. ఇకపోతే 'భోళా శంకర్' చిత్రాన్ని నవంబర్ 11 ఉదయం 7:45 గంటలకు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించనున్నారు. నవంబర్ 15 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే మెగాస్టార్ లుక్‌ కు సంబంధించి ప్రత్యేక ఫొటోషూట్ కూడా నిర్వహించారు.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందనున్న 'భోళాశంకర్' చిత్రాన్ని ఏకే ఎంటర్టైనెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సంస్థ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. మణిశర్మ తనయుడు యంగ్ సెన్సేషన్ మహతి స్వరసాగర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడి కానున్నాయి.