Begin typing your search above and press return to search.

అదే పవన్ స్పెషాలిటీ: హీరోయిన్ అంజలి

By:  Tupaki Desk   |   4 April 2021 4:05 PM IST
అదే పవన్ స్పెషాలిటీ: హీరోయిన్ అంజలి
X
పవన్ సినిమా రిలీజ్ అనగానే కొన్ని రోజుల ముందుగా సంక్రాంతి స్థాయిలో సంబరాలు కనిపిస్తాయి .. దీపావళి రేంజ్ లో సందళ్లు వినిపిస్తాయి. అలాంటిది ఆయన రాజకీయాలలోకి వెళ్లిన తరువాత చేసిన మొదటి సినిమాగా 'వకీల్ సాబ్' వస్తుందంటే, అభిమానుల కోలాహలం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఒక ప్రత్యేకమైన పాత్రలో నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రల్లో నివేదా థామస్ .. అంజలి .. అనన్య నాగళ్ల కనిపించనున్నారు.

ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో ఆర్టిస్టులు అంతా కూడా బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో అంజలి మాట్లాడుతూ .. "ఇది ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమా. హిందీ మూవీ 'పింక్' రీమేక్ అయినప్పటికీ, ఇక్కడి నేటివిటీకి తగినట్టుగా మార్పులు చేసి తీసిన సినిమా ఇది. ఈ సినిమా కథ ఏ సంఘటన చుట్టూ అయితే తిరుగుతుందో, అలాంటి సంఘటనలు చాలా చోట్ల జరిగాయి .. జరుగుతున్నాయి. అందువలన ఎన్నిసార్లు చెప్పినా కొత్తగా అనిపించే పాయింట్ ఇది.

పవన్ కల్యాణ్ గారితో నటించడం ఒక గొప్ప అనుభవం .. ఫస్టు డే ఆయన సెట్లో కనిపించగానే అలా చూస్తుండిపోయాను. ఆయన కాంబినేషన్లోని సీన్స్ అప్పుడు చాలా టెన్షన్ గా ఉండేది. పవన్ కల్యాణ్ గారికి బయట ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో .. ఆయన ఎంతటి స్టారో నాకు తెలుసు. అందువలన ఆయనతో కలిసి నటించడమనేది నెర్వస్ గా అనిపించేది. అయితే ఆయన మాలోని భయాన్ని పోగొట్టారు .. మేము కంఫర్టబుల్ గా ఉండేలా చూసుకున్నారు. సెట్లో ఎలాంటి స్టార్ డమ్ చూపించకుండా, అందరమూ ఒకటే అనే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు .. అదే ఆయన ప్రత్యేకత. అందువల్లనే కోర్టు సీన్ అంత బాగా వచ్చింది" అని చెప్పుకొచ్చింది.