Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్స్ బాగుపడాలంటే హీరోలు ముందుకు రావాలి...!

By:  Tupaki Desk   |   30 Aug 2020 6:00 AM IST
ప్రొడ్యూసర్స్ బాగుపడాలంటే హీరోలు ముందుకు రావాలి...!
X
క‌రోనా కారణంగా సినిమా థియేట‌ర్స్ మూత‌ప‌డ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు వాయిదా పడ్డాయి. ఈ మహమ్మారిని త్వరలోనే నాశనం చేస్తారు.. కొన్ని రోజుల్లో సాధారణ పరిస్థితులు వస్తాయి.. మళ్ళీ ఎప్పటిలాగే థియేటర్స్ ఓపెన్ అవుతాయని సినిమా వాళ్ళు భావించారు. అయితే ఇప్పటికి ఐదు నెలలు గడిచిపోయినా కరోనా వదిలిపోవడం లేదు. సినిమా షూటింగ్స్ ఎక్కడికక్కడ నిలిచిపోయి.. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు రిలీజ్ చేసే పరిస్థితులు లేకపోవడంతో నిర్మాతలు నష్టాలు చవిచూస్తున్నారు. ఇలానే మరికొన్ని రోజులు కొనసాగితే అప్పుల ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది. అయితే అలాంటి ప్రొడ్యూసర్స్ కి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ మరో ఆప్షన్ గా కనిపించాయి. ఇప్పటికే చాలా మంది ద‌ర్శ‌క నిర్మాత‌లు వారి సినిమాల‌ను ఓటీటీలో విడుద‌ల చేశారు.

అయితే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ - అజయ్ దేవగన్ - అభిషేక్ బచ్చన్ - అమితాబ్ బచ్చన్ - అలియా భట్ వంటి స్టార్స్ నటించిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతుంటే.. సౌత్ ఇండస్ట్రీలో మాత్రం కేవలం చిన్న మీడియం రేంజ్ సినిమాలు మాత్రమే విడుదల అవుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు థియేటర్స్ ఓపెన్ చేస్తే రిలీజ్ చేస్తారని భావించినా.. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్ర ప్ర‌భుత్వం థియేట‌ర్స్ విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు. దీంతో కోలీవుడ్ స్టార్ హీరోలు తమ ప్రొడ్యూసర్స్ పరిస్థితిని అర్థం చేసుకొని తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. ఐదు నెల‌లుగా థియేట‌ర్స్ కోసం వేచి చూస్తున్న తమిళ్ స్టార్స్ చిత్రాలు ఓటీటీ బాట ప‌డుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరో సూర్య 'ఆకాశమే నీ హద్దురా' సినిమాని డిజిటల్ రిలీజ్ కి రెడీ చేశారు.

కాగా, టాలీవుడ్ లో కూడా నిర్మాతలు బ్ర‌త‌కాలంటే స్టార్ హీరోలు కూడా ఈ విషయంలో ముందుకు రావాలని కొంతమంది మేకర్స్ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నాని - సుధీర్ బాబు నటించిన 'వి' సినిమా ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. ఇప్పటికే ఈ ఏడాది రిలీజ్ కావాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి. కానీ ఎవరు కూడా నిర్మాతల గురించి అలోచించి తమ సినిమాలు డిజిటల్ రిలీజ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నష్టాల నుంచి బయటపడి బాగుపడాలంటే ఆ హీరోలందరూ ఓటీటీ రిలీజ్ కి ఒప్పుకోవాల్సి ఉంటుంది. 'వి' సినిమా విడుదలైన తర్వాత మిగతా హీరోలు ముందుకు వస్తారేమో చూడాలి.