Begin typing your search above and press return to search.

బర్త్ డే కు నో చెప్పిన కెజిఎఫ్ హీరో

By:  Tupaki Desk   |   7 Jan 2019 7:38 AM GMT
బర్త్ డే కు నో చెప్పిన కెజిఎఫ్ హీరో
X
కన్నడ సినిమా చరిత్రలో ఎవరికి సాధ్యం కానీ అరుదైన ఫీట్ సాధించిన యష్ కెజిఎఫ్ పుణ్యమా అని దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మార్కెట్ పరంగా శాండల్ వుడ్ కున్న పరిమితులను పూర్తిగా తుడిచేసి యష్ తెలుగు తమిళ భాషల్లోనూ మంచి గుర్తింపుతెచ్చుకున్నాడు. కమర్షియల్ గా బయ్యర్లకు లాభసాటి ప్రోడక్ట్ గా మిగలడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వంద కోట్లు దాటిన మొదటి కన్నడ సినిమాగా కెజిఎఫ్ ప్రత్యేక రికార్డు నమోదు చేసుకుంది. రాజ్ కుమార్ లాంటి పవర్ ఫుల్ స్టార్ హీరోల కుటుంబాలు దర్శన్ సుదీప్ లాంటి క్రేజీ హీరోల వల్ల కానిది పట్టుమని పాతిక సినిమాలు కూడా పూర్తి కానీ ఓ యంగ్ హీరో సాధించడం అంటే విశేషమేగా.

అందులోనూ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేని ఒక స్టేజీ ఆర్టిస్ట్ చేసాడు అంటే అది ముమ్మాటికీ ఘనతే. ఇదిలా ఉండగా రేపు యష్ పుట్టిన రోజు. డిసెంబర్ 8తో రేపు 33లోకి అడుగు పెడుతున్న యష్ ఈ సంవత్సరం పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండబోతున్నాడు. తానెంతో ఆప్తుడిగా భావించే కన్నడ సీనియర్ హీరో అంబరీష్ మృతికి సంతాప సూచకంగా ఎటువంటి వేడుకలు చేసుకోవడం లేదని ప్రకటించాడు. అయితే ఇది అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చింది. తమ హీరో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సందర్భం కాబట్టి కనివిని ఎరుగని రీతిలో సెలెబ్రేట్ చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.

అయితే హీరో విన్నపం ఏమో కానీ వాళ్ళు మాత్రం ఆగేలా లేరు. యష్ చేసుకోకపోయినా పర్వాలేదని ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని గౌరవిస్తూనే అంబరీష్ గారి స్మరణతో గ్రాండ్ గా వేడుక చేసుకుంటామని ప్రకటిస్తున్నారు. మొత్తానికి స్టార్ స్టేటస్ అమాంతం పెరిగిపోయిన యష్ దురదృష్టవశాత్తు ఇలా వేడుకలకు దూరం కావడం షాకే.