Begin typing your search above and press return to search.

గురువు ఆఫర్‌ తో నైనా లక్‌ కలిసి వచ్చేనా?

By:  Tupaki Desk   |   19 Jan 2019 10:27 AM GMT
గురువు ఆఫర్‌ తో నైనా లక్‌ కలిసి వచ్చేనా?
X
తెలుగు ప్రేక్షకులకు 'బాయ్స్‌'తో పరిచయం అయిన హీరో సిద్దార్థ్‌ ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించాడు. తన వద్ద సహాయ దర్శకుడిగా ఉన్న సిద్దార్థ్‌ ను హీరోగా పరిచయం చేసింది శంకర్‌. హీరోగా తెలుగు - తమిళంలో చాలా కాలం పాటు మంచి ఆధరణ దక్కించుకున్న సిద్దార్థ గత కొన్నాళ్లుగా చేస్తున్న సినిమాలు ఒక్కటి కూడా పెద్దగా ఆడటం లేదు. దాంతో సిద్దార్థ మెల్ల మెల్లగా సినిమాలకు దూరం అవుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. సిద్దార్థ కెరీర్‌ ఖతం అయ్యిందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా గురువు శంకర్‌ నుండి పిలుపు వచ్చింది.

ఇటీవలే '2.ఓ' వంటి భారీ చిత్రాన్ని తీసి విడుదల చేసి - ప్రస్తుతం కమల్‌ హాసన్‌ తో 'భారతీయుడు 2' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శంకర్‌ ఒక కీలక పాత్ర కోసం సిద్దార్థను ఎంపిక చేసుకున్నాడని సమాచారం అందుతోంది. మొదట ఈ పాత్రను శింబుతో చేయించాలని భావించారట. కాని శింబు స్థానంలో తాజాగా సిద్దు వచ్చి చేరాడు. శింబు ఎందుకు ఈ చిత్రం నుండి తొలగించబడ్డాడో తెలియదు కాని 'భారతీయుడు 2' చిత్రంలో సిద్దుకు ఛాన్స్‌ రావడం అనేది చాలా పెద్ద విషయం.

తమిళంతో పాటు తెలుగు - హిందీల్లో కూడా విడుదల కాబోతున్న 'భారతీయుడు 2' చిత్రంలో సిద్దు కీలక పాత్రలో కనిపించి మెప్పిస్తే మళ్లీ బిజీ అయ్యే అవకాశాలున్నాయి. హీరోగా కాకున్నా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా లేదంటే విలన్‌ గా అయినా సిద్దుకు ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. భారతీయుడు 2 చిత్రంతో అయినా సిద్దుకు లక్‌ కలిసి వచ్చి సక్సెస్‌ దక్కి, మళ్లీ బిజీ అవుతాడేమో చూడాలి.