Begin typing your search above and press return to search.

దృష్టిపెడితే ఆ హీరో మరో శోభన్ బాబు అనిపించుకునేవాడట!

By:  Tupaki Desk   |   25 March 2021 5:00 AM IST
దృష్టిపెడితే ఆ హీరో మరో శోభన్ బాబు అనిపించుకునేవాడట!
X
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయకులలో సురేశ్ ఒకరు. అప్పట్లో ఆయనను చూసినవాళ్లు హీరో అంటే ఇలా ఉండాలని అనుకున్నారు. హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సురేశ్, తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేయడం విశేషం. తమిళనాట లవర్ బాయ్ ఇమేజ్ ను చాలాకాలం పాటు కొనసాగించిన హీరో ఆయన. తెలుగులో నాయిక ప్రధానమైన చిత్రాల్లో ఎక్కువగా సందడి చేశాడు. 'సూరిగాడు' .. 'అమ్మోరు' .. 'దొంగాట' వంటి సినిమాలు ఆయన కెరియర్లో చెప్పుకోదగినవిగా కనిపిస్తాయి. హీరోగానే కాదు .. 'దేవీపుత్రుడు' తరహా నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రల్లోను ఆయన మెప్పించాడు.

అలాంటి సురేశ్ గురించి తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. "సురేశ్ చాలా అల్లరి పిల్లాడు .. సెట్లో ఎప్పుడూ సరదాగా జోకులు వేస్తూ నవ్విస్తూనే ఉండేవాడు. రాఘవేంద్రరావుగారు నవ్విస్తే ఆనందపడతారు. సురేశ్ నవ్వించి ఆనందపడతాడు. షూటింగ్ అయిపోయేంతవరకూ అలా నవ్విస్తూనే ఉంటాడు. సురేశ్ ను గమనిస్తే ఆయన బాడీ లాంగ్వేజ్ లోనే డాన్స్ ఉందనే విషయం అర్థమవుతుంది. డాన్స్ చాలా అద్భుతంగా చేస్తాడు. తమిళ సినిమాల స్థాయిలో ఆయన తెలుగు సినిమాలపై దృష్టి పెట్టలేదు. కాస్త దృష్టి పెడితే మరో శోభన్ బాబు అనిపించుకునేవాడు.

సీనియర్ నరేశ్ .. రాజేంద్రప్రసాద్ తరువాత ఆ దారిలో 'అల్లరి నరేశ్' వెళ్లాడు. అదే విధంగా శోభన్ బాబు తరువాత ఆ దారిలో జగపతిబాబు వెళతాడని అనుకున్నాను. ఎస్వీ కృష్ణారెడ్డిగారి సినిమాలతో జగపతిబాబుకి వచ్చిన క్రేజ్ ను చూసినప్పుడు ఆయన ఆ రూట్లో వెళతాడని భావించాను. ఆ తరువాత సురేశ్ ను చూసినప్పుడు అలాగే అనిపించింది. సురేశ్ తెలుగు సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టి ఉంటే మరో శోభన్ బాబుగా ఎదిగే అవకాశం ఉండేది. ఆయనతో 'మరో క్విట్ ఇండియా' .. 'తోడి కోడళ్లు' వంటి సినిమాలకి పనిచేశాము. 'తోడికోడళ్లు' మంచి హిట్ అనిపించుకుంది. ఈ మధ్య సీనియర్ నరేశ్ .. రాజేంద్రప్రసాద్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా దూసుకుపోతున్నారు. వాళ్ల మాదిరిగానే సురేశ్ కూడా మంచి పాత్రలను చేయాలని కోరుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు.