Begin typing your search above and press return to search.

ఈవెంట్ కి రాకుండా కీర్తి హ్యాండ్ ఇచ్చేసింది: హీరో నితిన్

By:  Tupaki Desk   |   19 March 2021 5:50 PM GMT
ఈవెంట్ కి రాకుండా కీర్తి హ్యాండ్ ఇచ్చేసింది: హీరో నితిన్
X
తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలను తమదైన శైలిలో ఆవిష్కరిస్తున్న దర్శకులలో వెంకీ అట్లూరి ఒకరు. 'తొలిప్రేమ' .. 'మిస్టర్ మజ్ను' చిత్రాలు ఆయన టేకింగులోని కొత్తదనానికి అద్దం పట్టాయి. తాజాగా ఆయన మరో ప్రేమకథతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు .. ఆ సినిమా పేరే 'రంగ్ దే'. నితిన్ జోడిగా కీర్తి సురేశ్ నటించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్నరాత్రి 'కర్నూల్'లో జరిగింది.

ఈ వేడుకకి జనం భారీ సంఖ్యలో హాజరయ్యారు. నితిన్ పక్కన కీర్తి సురేశ్ కనిపించకపోవడం .. దర్శకుడు వెంకీ అట్లూరి కూడా రాకపోవడం ఫంక్షన్ లో ప్రధానమైన వెలితిగా కనిపించింది. భారీ జనసందోహంలోనే వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత హీరో నితిన్ మాట్లాడుతూ .. "కర్నూల్ అనగానే ముందుగా 'కొండారెడ్డి బురుజు' గుర్తుకు వస్తుంది. అక్కడ తీసిన సినిమాలన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి. ఆ ప్లేస్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో .. మీరంతా అంతకంటే ఎక్కువ పవర్ఫుల్ గా ఉన్నారు. నేను చాలా ఈవెంట్స్ కోసం చాలా ఊళ్లకు వెళ్లాను .. కానీ ఈ రేంజ్ ఎనర్జీ ఎక్కడా చూడలేదు. మీ ప్రేమను .. ఆదరణను నేను ఎప్పటికీ మరిచిపోలేను.

నిజానికి ఈ ఫంక్షన్ కి కీర్తి రావాలి .. కానీ హ్యాండ్ ఇచ్చేసింది. ఈ సినిమా డైరెక్టర్ రావాలి .. కానీ ఆయన కూడా హ్యాండ్ ఇచ్చాడు. వీళ్లెవరూ రాలేదు .. నేను ఒక్కడినే ఉన్నానే అని కాస్త డల్ అయ్యాను. కానీ మీరంతా ఉండగా వాళ్లంతా ఎందుకు బొక్కా .. వేస్టు వాళ్లందరూ .. మీరుంటే చాలు మాకు. ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ .. మార్చి 26వ తేదీన వస్తోంది. రాయలసీమ అనగానే ఫ్యాక్షన్ .. మాస్ ఎక్కువని అంటారు. కానీ ఆ రెండింటికన్నా మీలో లవ్వు ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ లవ్ స్టోరీ ఫస్టు ఈవెంట్ ను ఇక్కడ పెట్టాము .. సినిమా చూసి హిట్టు ఇవ్వండి" అంటూ నితిన్ చాలా తక్కువసేపు .. ఎక్కువ స్పీడ్ లో మాట్లాడి ముగించేశాడు.