Begin typing your search above and press return to search.

యంగ్ హీరో కమ్ విలన్ నెక్స్ట్ మూవీ ఏంటి..?

By:  Tupaki Desk   |   13 Jan 2022 3:30 PM GMT
యంగ్ హీరో కమ్ విలన్ నెక్స్ట్ మూవీ ఏంటి..?
X
'ప్రేమతో మీ కార్తీక్' సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ.. 'Rx 100' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు.

కేవలం హీరోగా మాత్రమే సినిమాలు చేయాలని ఫిక్స్ అవకుండా.. అప్పుడప్పుడు ప్రతినాయకుడి పాత్రల్లోనూ నటిస్తూ తనలోని నటుడిని బయటకు తీస్తున్నాడు. కాకపోతే యువ హీరోకు గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేకపోవడంతో రేసులో కాస్త వెనుకబడిపోయాడు.

కార్తికేయ హీరోగా నటించిన 'గుణ 369' 'హిప్పీ' '90 ML' వంటి సినిమాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయాయి. అలానే ఎన్నో ఆశలు పెట్టుకున్న 'చావు కబురు చల్లగా' 'రాజా విక్రమార్క' సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.

కార్తికేయ మధ్యలో విలన్ గా చేసిన నాని 'గ్యాంగ్ లీడర్' సినిమా మంచి పేరుతో పాటుగా అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో 'వలిమై' సినిమాలో టాలీవుడ్ యువ హీరో పోషించిన నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాల్లో కార్తికేయ ఆకట్టుకున్నాడు.

హీరో అజిత్ కుమార్ కు దీటుగా నిలిచే పవర్ ఫుల్ పాత్రలో కార్తికేయ కనిపించనున్నారని తెలుస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన 'వలిమై' సినిమాని జీ స్టూడియోస్ సమర్పణలో బోనీ కపూర్ నిర్మించారు. తమిళంతో పాటుగా హిందీ తెలుగు వంటి పలు భారతీయ బాషల్లో ఈ యాక్షన్ థ్రిల్లర్ విడుదల కానుంది.

పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యే 'వలిమై' సినిమాతో కార్తికేయ కు ఇతర ఇండస్ట్రీలలో కూడా గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే హీరోగా చేయబోయే తదుపరి సినిమా ఏంటనేదే ఇంతవరకు క్లారిటీ రావడం లేదు. యువ హీరోలందరూ వరుసగా సినిమాలు లైన్ లో పెడుతుండగా.. కార్తికేయ మాత్రం హీరోగా నెక్స్ట్ మూవీ అప్ డేట్ ఇవ్వడం లేదు.

'Rx100' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ అజయ్ భూపతి - కార్తికేయ కలసి మరో సినిమా ప్లాన్ చేస్తున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. భారీ బడ్జెట్‌ తో తెలుగు తమిళ భాషల్లో రూపొందే ఈ బైలింగ్విల్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ జెమినీ ఫిలిం సర్క్యూట్ నిర్మిస్తుందని టాక్ వచ్చింది.

కార్తికేయ కోసం అజయ్ మంచి స్టోరీ లైన్ రెడీ చేసారని.. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని నివేదికలు వెల్లడించాయి. మరి యంగ్ హీరో 'వాలిమై' సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూస్తారా లేదా త్వరలోనే హీరోగా తదుపరి సినిమాపై అధికారిక ప్రకటన ఇస్తారా అనేది చూడాలి.