Begin typing your search above and press return to search.

రజనీ కోసం అతడు 28 ఏళ్లుగా ఓటే వేయలేదట!

By:  Tupaki Desk   |   13 Dec 2020 11:26 AM IST
రజనీ కోసం అతడు 28 ఏళ్లుగా ఓటే వేయలేదట!
X
రజనీకాంత్ అంటే తమిళ జనాలకు ఎంత పిచ్చో, ప్రేమో అందరికీ తెలిసిందే. స్వతహాగా ఆయన కన్నడిగుడు అయినా తమ మనిషిలాగే తమిళ జనాలు ఆదరిస్తున్నారు. పెద్ద సినీ స్టార్ ని చేశారు. రజినీకి ఒక్క తమిళనాడులోనే కాదు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అమెరికా, ఆఫ్రికా, జపాన్, మలేషియా సింగపూర్ లలో కూడా రజినీకి భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే ఆయన కొత్త సినిమా విడుదల అవుతుందంటే తమిళనాడు సహా చాలా ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది.

రజినీ సినిమాలే కాదు ఆయన వ్యక్తిత్వం కూడా జనాలకు ఎంతో ఇష్టం. అందుకే ఆయన సీఎం అయితే తమ రాతలు మారతాయని ఎన్నో ఏళ్లుగా తమిళ ప్రజలు రాజకీయాల్లోకి రావాలంటూ రజినీకాంత్ ని కోరుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు వారి ఆశలు ఫలించాయి. కొద్ది రోజుల కిందట పార్టీ పెడుతున్నట్లు రజినీకాంత్ ప్రకటించారు. డిసెంబర్ 31న పార్టీ విధి విధానాలు పూర్తి వివరాలు తెలియజేయనున్నారు. జనవరిలో పార్టీ పెట్టనున్నారు. ప్రస్తుతం అయిన పార్టీ పేరు, చిహ్నం, పార్టీ రిజిస్ట్రేషన్ సంబంధించిన పనులను ముమ్మరంగా చేస్తున్నారు.

కాగా తమిళనాడులో రజనీకాంత్ కు గుడి కట్టే అభిమానులు కూడా ఉన్నారని ఎంతో మంది తెలుసు. కానీ ఓ అభిమాని మాత్రం రజినీ రాజకీయాల్లోకి రావాలని 28 ఏళ్లుగా ఓటు వేయకుండా ఎదురుచూస్తూ వస్తున్నాడు.

తమిళనాడులోని పుదుక్కొట్టై కి చెందిన మహేంద్రన్ కి 28 ఏళ్ల కిందటే ఓటు హక్కు వచ్చింది. మహేంద్రన్ రజనీకాంత్ కు వీరాభిమాని. తనకు ఓటు హక్కు వచ్చినా 28 ఏళ్లుగా అతడు ఏ పార్టీకి ఓటు వేయలేదు. ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలను బహిష్కరించాడు. ఇప్పుడు రజినీకాంత్ పార్టీ పెట్టడంతో వేసవిలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో తొలిసారి అతడు రజనీకాంత్ కు ఓటు చేయబోతున్నాడు.