Begin typing your search above and press return to search.

అరవ సినిమాల అడ్రస్ గల్లంతేనా?

By:  Tupaki Desk   |   24 Sep 2019 1:30 AM GMT
అరవ సినిమాల అడ్రస్ గల్లంతేనా?
X
ఒక నరసింహా.. గజిని.. ఒక చంద్రముఖి.. ఒక శివాజీ.. ఒక అపరిచితుడు.. ఒక రంగం.. టాలీవుడ్ బాక్సాఫీస్‌ ను షేక్ చేసిన తమిళ డబ్బింగ్ సినిమాలివి. ఈ స్థాయిలో కాకపోయినా.. తెలుగు గడ్డపై వసూళ్ల వర్షం కురిపించి.. తెలుగు సినిమాలకు గట్టి పోటీ ఇచ్చిన అరవ అనువాదాలు చాలానే ఉన్నాయి. రజనీకాంత్ - కమల్ హాసన్ - సూర్య - కార్తి - విశాల్ లాంటి తమిళ హీరోలు హీరోలు తెలుగులో మాంచి ఫాలోయింగ్ సంపాదించి తమకంటూ మార్కెట్ కూడా సొంతం చేసుకున్నారు. కానీ ఇదంతా గతం. ఇప్పుడు తెలుగులో తమిళ అనువాదాల బండి ఏమాత్రం నడవట్లేదు. అక్కడి హీరోల్ని నెత్తిన పెట్టుకునే రోజులు పోయాయి. ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలంటే ఎగబడి చూసిన తెలుగు ప్రేక్షకులు.. ఇప్పుడు వాటిని పట్టించుకోవడమే మానేస్తున్నారు.

ఈ ఏడాది డబ్బింగ్ సినిమాల హడావుడి సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ‘పేట’తో మొదలైంది. సంక్రాంతికి తెలుగులో పెద్ద చిత్రాాలతో పోటీ పడ్డ ‘పేట’.. ‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ - ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్లయినా కూడా నిలబడలేకపోయింది. టాక్ మరీ నెగెటివ్‌ గా ఏమీ లేకపోయినా ఆ సినిమా నిలబడలేదు. ఆ తర్వాత వచ్చిన ఎన్నో డబ్బింగ్ సినిమాలు తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి. ఈ ఏడాది తెలుగులో ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టి ఏకైక చిత్రం ‘కాంఛన-3’ మాత్రమే. అది కూడా మాస్ సెంటర్లలో ఏదో అలా ఆడేసింది. మిగతా డబ్బింగ్ సినిమాలన్నీ తుస్సుమనిపించాయి. కార్తి నటించిన ‘దేవ్’ - అజిత్ సినిమా ‘విశ్వాసం’ - విశాల్ చిత్రాలు ‘పులిజూదం’ - ‘అయోగ్య’.. నయనతార చిత్రం ‘ఐరా’ - అంజలి నటించిన ‘లిసా’.. అమలాపాల్ సినిమా ‘ఆమె’ - విజయ్ ఆంటోోనీ ప్రధాన పాత్రలో నటించిన ‘కిల్లర్’.. విక్రమ్ మూవీ ‘మిస్టర్ కేకే’.. ఈ సినిమాలేవీ కూడా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. టాక్‌తో సంబంధం లేకుండా ఆ సినిమాలు ఫెయిలయ్యాయి. సూర్య వేసవిలో ‘ఎన్జీకే’తో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ‘బందోబస్త్’ రూపంలో అతడికి ఎదురు దెబ్బ తగిలింది.

ఎవరి మార్కెట్టూ నిలవలేదు

‘గజిని’ - ‘వీడొక్కడే’ - ‘సింగం’ - ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ లాంటి సినిమాలతో ఒకప్పుడు సూర్య తెలుగులో మంచి మార్కెట్ సంపాదించాడు. రూ.20 కోట్ల దాకా అతడి మార్కెట్ వెళ్లింది. కానీ ఇప్పుడు అతడి కొత్త సినిమా ‘బందోబస్త్’ కోటి రూపాయల షేర్ సాధించడం కూడా కష్టంగా ఉంది. గత కొన్నేళ్లలో వరుస ఫ్లాపులతో అతను బాగా వెనుకబడిపోయాడు. సూర్య మాత్రమే కాదు.. చాలామంది తమిళ స్టార్ల పరిస్థితి ఇంతే. రజనీకాంత్ కేవలం తమిళంలో మాత్రమే సూపర్ స్టార్ కాదు. తెలుగు వాళ్లు సైతం ఆయన్ని సూపర్ స్టార్‌ గానే చూసేవాళ్లు. రజనీ సినిమా వస్తోందంటే.. పోటీగా తెలుగు సినిమాలు రిలీజ్ చేయడానికి భయపడే పరిస్థితి ఉండేది చాలా ఏళ్లు. సూపర్ స్టార్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు దీటుగా వసూళ్ల మోత మోగుతుంది. కానీ ఇదంతా గతం. ఇప్పుడు కథ మారింది. రజనీ సినిమాలకు మునుపటి క్రేజ్ లేదు. ఆయన సినిమాల్ని కొనడానికి వేలం వెర్రి లేదు. సూపర్ స్టార్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రమే. ఓపెనింగ్సూ కష్టమే. మొత్తంగా తెలుగులో రజనీ ఉనికే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి తలెత్తింది. చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘పేట’ ఓ మోస్తరు టాక్ తెచ్చుకుని కూడాా ఐదారు కోట్లకు మించి షేర్ రాబట్టలేకపోయింది. ‘కబాలి’ అనే సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా రూ.25 కోట్ల దాకా షేర్ రాబట్టడం గమనార్హం. మధ్యలో వచ్చిన ‘2.0’ స్పెషల్ ఫిలిం కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే.. గత కొన్నేళ్ల నుంచి తెలుగులో రజనీ ప్రభ తగ్గుతూ వస్తోంది. ‘పేట’తో రజనీ మార్కెట్ పూర్తిగా దెబ్బ తినేసింది. మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్‌ తో రజనీ చేస్తున్న క్రేజీ మూవీ ‘దర్బార్’ డబ్బింగ్ హక్కుల కోసం అసలు పోటీనే కనిపించడం లేదన్నది ట్రేడ్ వర్గాల సమాచారం. ‘శివపుత్రుడు’ - ‘అపరిచితుడు’ సినిమాలతో ఒకప్పుడు బంపర్ క్రేజ్ సంపాదించిన ‘విక్రమ్’ సైతం తెలుగులో ఇప్పుడు జీరో అయిపోయాడు. సూర్య తమ్ముడు కార్తి సైతం ‘ఆవారా’ - ‘నా పేరు శివ’ లాంటి సినిమాలతో తెలుగులో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సంపాదించి.. గత కొన్నేళ్లలో ఆ పేలవమైన సినిమాలతో తన మార్కెట్ దెబ్బ తీసుకున్నాడు. అతడి సినిమాల్ని ఇప్పుడసలు పట్టించుకునే పరిస్థితే కనిపించడం లేదు. కమల్ హాసన్ సినిమాలు మానేశాడు కానీ.. ఆయన చివరగా చేసిన ‘విశ్వరూపం-2’ - ‘చీకటి రాజ్యం’ లాంటి సినిమాలకు ఇక్కడ కనీస స్థాయిలో కూడా ఆదరణ దక్కలేదు. విశాల్ పరిస్థితి కూడా ఇప్పుడు ఏమంత గొప్పగా లేదు. ధనుష్ - జీవా లాంటి హీరోలు కూడాా మధ్యలో కాస్త గుర్తింపు సంపాదించి.. దాన్ని పోగొట్టుకున్నవాళ్లే. విజయ్ చాలా ఏళ్ల పోరాటం తర్వాత కొంచెం మార్కెట్ సంపాదించుకున్నా.. దాన్ని ఎన్నాళ్లు నిలబెట్టుకుంటాడో చూడాలి. అజిత్ పరిస్థితీ అంతంమాత్రమే.

ఏంటి కారణం?

ఒకప్పుడు తెలుగు సినిమాలు రొటీన్‌ గా సాగిపోయేవి. స్టార్ హీరోలు కొత్తగా ఏ ప్రయత్నం చేసేవాళ్లు కాదు. రొడ్డొకట్టుడు సినిమాలతో విసిగించేవాళ్లు. అలాంటి సమయంలో తమిళంలో కొత్త కొత్త ప్రయత్నాలు జరిగేవి. తమిళ సినిమాలంటే కొత్తగా ఉంటాయి అనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉండేవి. మన దగ్గర లేని వినోదం - కొత్తదనం వాళ్లు ఇచ్చేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి రివర్స్ అయింది. తెలుగు సినిమా ఎంతో మారింది. ఇక్కడే ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. స్టార్ హీరోలు ఊర మాస్ సినిమాలు వదిలేసి కొత్తదనం వైపు చూస్తున్నారు. ‘బాహుబలి’ లాంటి భారీ సినిమాలు - ‘అర్జున్ రెడ్డి’ లాంటి సరికొత్త సినిమాలు తెలుగులోనే వస్తున్నాయి. మిగతా భాషల ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తున్నాయి. అదే సమయంలో తమిళ సినిమాల క్వాలిటీ దెబ్బ తింది. వాళ్ల సినిమాల్లో ఇప్పుడంత విషయం ఉండట్లేదు. దీంతో నెమ్మదిగా తమిళ సినిమాలపై మన ప్రేక్షకుల ఆసక్తి తగ్గిపోతూ వస్తోంది.