Begin typing your search above and press return to search.

సక్సెస్ ఫుల్ 'హీరో-డైరెక్టర్' కాంబోలో హ్యాట్రిక్ మూవీ..!

By:  Tupaki Desk   |   14 July 2021 6:10 AM GMT
సక్సెస్ ఫుల్ హీరో-డైరెక్టర్ కాంబోలో హ్యాట్రిక్ మూవీ..!
X
టాలీవుడ్ డైనమిక్ హీరో గోపీచంద్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సంపత్‌ నంది దర్శకత్వంలో 'సీటీమార్' అనే స్పోర్ట్స్‌ బ్యాక్ డ్రాప్ సినిమాని పూర్తి చేసిన గోపీచంద్.. మరోవైపు మారుతి డైరెక్షన్ లో 'పక్కా కమర్షియల్' సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో తనకు రెండు సూపర్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు శ్రీవాస్ తో హ్యాట్రిక్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు మ్యాకో హీరో.

గోపీచంద్ హీరోగా నటించిన 'లక్ష్యం' సినిమాతో శ్రీవాస్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత 'లౌక్యం' అనే మరొక సెన్సేషనల్ హిట్ సినిమా కోసం చేతులు కలిపారు. ఈ క్రమంలో గోపిచంద్ - శ్రీవాస్ ల సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది గోపిచంద్ కెరీర్ లో మైలురాయి 30వ చిత్రంగా రూపొందనుంది.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనుండగా.. వివేక్ కుచిభోట్ల సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. గోపిచంద్ మరియు శ్రీవాస్‌ లతో నిర్మాతలకు ఇది మొదటి సినిమా. తాజాగా 'గోపీచంద్30' చిత్రాన్ని ప్రకటించిన మేకర్స్.. ఓ పోస్టర్ ని విడుదల చేశారు. అనౌన్సమెంట్ పోస్టర్ లో కోల్‌ కటా లోని హౌరా బ్రిడ్జ్ - అక్కడి ప్రసిద్ధ కాళి మాతా విగ్రహం మరియు భారీ ట్రాఫిక్‌ ను చూపిస్తారు.

'గోపీచంద్30' పోస్టర్ చూస్తుంటే ఈ క్రేజీ కాంబినేషన్ కోల్‌కతా బ్యాక్‌ డ్రాప్‌ లో సెట్ చేయబడిందని అర్థం అవుతోంది. ఈ చిత్రానికి భూపతి రాజా కథ అందిస్తున్నారు. వీరి కాంబోపై ఉండే అంచనాలను దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ రెడీ చేసిన శ్రీవాస్.. గోపీచంద్ ను మెప్పించినట్లు తెలుస్తోంది. 'లక్ష్యం' 'లౌక్యం' సినిమాల తరహాలోనే ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు కామెడీ కలబోసి పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ప్రస్తుతం గోపీచంద్30 సినిమా కోసం మిగతా నటీనటులు - సాంకేతిక నిపుణులను మేకర్స్ ఫైనలైజ్ చేస్తున్నారు. 'పక్కా కమర్షియల్' సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ తో శ్రీవాస్ ఓ సినిమా చేయనున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చాయి. బాలయ్య సైడ్ నుంచి కూడా పాజిటివ్ సిగ్నల్ వచ్చిందని.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో రూపొందనుందని అన్నారు. మరి ఇప్పుడు గోపీచంద్ తో శ్రీవాస్ చేస్తున్నది అదే స్క్రిప్ట్ తోనా లేదా మరో కొత్త స్టోరీనా అనేది తెలియాల్సి ఉంది.