Begin typing your search above and press return to search.

మెగా ఫ్యామిలీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

By:  Tupaki Desk   |   13 Feb 2021 2:00 PM IST
మెగా ఫ్యామిలీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
X
‘ఉప్పెన’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయ్యాడు పంజా వైష్ణవ్ తేజ్. ఈ సినిమాలో అతడి ఫస్ట్ లుక్ చూసినపుడే చాలామంది మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న అరంగేట్ర హీరో ఇలాంటి సినిమా ఎంచుకున్నాడేంటి అన్నట్లుగా మాట్లాడారు. మామూలుగా పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చే కొత్త హీరోలు.. మాస్, యాక్షన్ సినిమాలనే అరంగేట్రానికి ఎంచుకుంటారు. లుక్స్ మోడర్న్‌గా, స్టైలిష్‌గా ఉండేలా చూసుకుంటారు. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం అలా ఆలోచించలేదు. ఒక ప్రేమకథతో అరంగేట్రం చేయడానికి రెడీ అయ్యాడు. అందులో పూర్తిగా డీగ్లామరస్‌గా కనిపించాడు. ఇప్పటిదాకా మంచి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఏ కొత్త హీరో కూడా ఇలాంటి సాహసం చేయలేదంటే అతిశయోక్తి కాదు.

ఇదంతా ఒకెత్తయితే ‘ఉప్పెన’లోని షాకింగ్ ట్విస్టుకు అతను అంగీకరించడం మరో ఎత్తు. వినడానికి ఏదోలా అనిపించే ఆ ట్విస్టును అంత సులభంగా ఎవరూ అంగీకరించరు. టాలీవుడ్లో ప్రయోగాలకు పేరు పడ్డ హీరోలు ఈ పాత్ర చేయడానికి అంగీకరించేవారా అంటే సందేహమే. ఈ ట్విస్టు వల్ల యాంటీ ఫ్యాన్స్ వెటకారాలు తప్పవు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగొచ్చు. అయినా వైష్ణవ్ తేజ్ అవేమీ పట్టించుకోకుండా ఈ సినిమా ఒప్పుకున్నాడు. వైష్ణవ్ సాహసానికి సెల్యూట్ చేయాల్సిందే.

ఈ విషయంలో వైష్ణవ్ ఒక్కడినే కాదు.. కథపై అభ్యంతరాలు చెప్పకుండా ఓకే చేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇతర మెగా ఫ్యామిలీ వారికి కూడా అభినందనలు చెప్పాలి. ఎందుకంటే కమర్షియల్ సినిమాలంటేనే మెచ్చే చిరు ఇలాంటి కథతో తన మేనల్లుడు అరంగేట్రం చేయడానికి అంగీకరించారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎంతో సున్నితమైన ఈ పాయింట్‌ను తెరపై సరిగా ప్రెజెంట్ చేయకపోతే చాలా తేడా వచ్చేస్తుంది. సినిమా చెడిపోతుంది. దాని వల్ల వైష్ణవ్ కెరీర్‌కు పెద్ద ఇబ్బంది ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంది. అయినా సరే.. ధైర్యంగా ఈ సినిమాను ఓకే చేశారంటే గొప్ప విషయమే. అలాగే దర్శకుడి మీద నమ్మకం పెట్టి ఈ సినిమాను ఓకే చేసిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు, సుకుమార్‌ కూడా అభినందనీయులే. వీళ్లందరి నమ్మకాన్ని నిలబెడుతూ బుచ్చిబాబు సానా ఆ పాయింట్‌ను ఎంతో అర్థవంతంగా డీల్ చేశాడు. ప్రేక్షకులను ఆలోచించజేశాడు. కదిలించాడు. ఆ మలుపే ఇప్పుడు సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది.