Begin typing your search above and press return to search.

బన్నీ నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ : రాజమౌళి

By:  Tupaki Desk   |   13 Dec 2021 8:39 AM IST
బన్నీ నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ : రాజమౌళి
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. అడవి నేపథ్యంలో ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా చూట్టూ తిరిగే కథ ఇది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడి పాత్రను ఫాహద్ ఫాజిల్ పోషించాడు. ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబాద్ - యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.

ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ .. "ఒక రకంగా ఈ రోజు నాకు చాలా బాధగానూ ఉంది .. చాలా ఆనందంగాను ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ .. ఫేవరేట్ డైరెక్టర్ సుకుమార్ ఇక్కడ లేడు. బాంబేలో ఫుల్ బిజీగా ఉన్నాడు. 'పుష్ప'ను ది బెస్ట్ గా అందించే పనుల్లోనే ఉన్నాడు. నాకు సుక్కూ అంటే చాలా ఇష్టం .. తన సినిమాలంటే చాలా చాలా ఇష్టం. మేమిద్దరం రెగ్యులర్ గా మెసేజ్ లు పెట్టుకుంటూ ఉంటాము. సుక్కు సినిమా ఏదైనా రిలీజ్ అయితే అదిరిపోయిందని నేను .. నా సినిమా ఏదైనా రిలీజ్ అయితే 'సార్ చింపేశారు' అని తాను చెప్పుకుంటూ ఉంటాము.

ఈ మధ్య తాను టైమ్ సరిపోవడం లేదని మెసేజ్ పెడుతూ ఉంటే, టైమ్ గురించి ఆలోచించకు .. నీ పనిని నువ్వు చేస్తూ వెళ్లు అని చెప్పాను. అప్పటి నుంచి ఆయన డే అండ్ నైట్ ఒక్క సెకను కూడా వేస్టు చేయకుండా కష్టపడుతున్నాడు. ష్యూర్ గా చెబుతున్నాను .. సినిమా అద్భుతంగా ఉంటుంది. నేను 'ఆర్ ఆర్ ఆర్' పనుల మీద బాంబే వెళుతున్నాను .. వస్తున్నాను. ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అని అక్కడి వాళ్లను అడిగాను. వాళ్లంతా 'పుష్ప' కోసం వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పారు. బన్నీ ఇంత మంచి ప్రాజెక్టు నీ చేతిలో ఉంది .. అందుకు తగినట్టుగా అక్కడ ప్రమోషన్స్ చేయాలి. ఇందులో నా స్వార్థం మాత్రమే కాదు .. ఇండస్ట్రీ స్వార్థం ఉంది. 'పుష్ప' కేవలం తెలుగు ఇండస్ట్రీ సినిమా కాదు .. అది ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్లాలి. ఎంత భారీగా వెళ్లాలో అంత భారీగానూ వెళ్లాలి.

'పుష్ప' టీజర్ వచ్చినప్పుడే కళ్లు చెదిరిపోయాయి. నాకు అన్నిటిలో కంటే బాగా నచ్చింది విజువల్స్. రామ్ - లక్ష్మణ్, పీటర్ హెయిన్స్ ఫ్యాన్స్ పిచ్చెక్కించేలా ఫైట్స్ ను కంపోజ్ చేశారు" అన్నారు. ఇక బన్నీని ఉద్దేశించి, 'బన్నీ నీ డెడికేషన్ కి హ్యాట్సాఫ్. నువ్వు పెట్టే ఎఫర్ట్ కీ .. నువ్వు పడే కష్టానికి .. డైరెక్టర్ పై నీకు గల నమ్మకానికి .. హ్యాట్సాఫ్ చెబుతున్నాను. ఇండస్ట్రీకి లభించిన పెద్ద గిఫ్ట్ నువ్వు. నిన్ను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి .. అవుతారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కడ ఓపెన్ చేస్తే అక్కడ ఫుల్ అవుతున్నాయట. వినడానికి చాలా బావుంది. డిసెంబర్ 17 .. 'పుష్ప' .. ఫస్టు డే ఫస్టు షో .. ఓన్లీ థియేటర్స్ లో చూడండి" అని చెప్పుకొచ్చారు.