Begin typing your search above and press return to search.

వరుణ్ ని పక్కకు తోసేసారా

By:  Tupaki Desk   |   8 Jan 2019 5:15 AM GMT
వరుణ్ ని పక్కకు తోసేసారా
X
యూత్ హీరోలతో కలిసి నటించేందుకు ఉత్సాహపడే సీనియర్ హీరోలలో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రామ్ తో మొదలుకుని త్వరలో మొదలుకాబోయే నాగ చైతన్య దాకా కథ నచ్చడం ఆలస్యం ఏ కాంబోకైనా రెడీ అంటున్నాడు. ఇప్పుడు వరుణ్ తేజ్ వంతు వచ్చింది. సంక్రాంతి రేస్ లో ఎంటర్ టైనర్ జానర్ లో వస్తున్న ఎఫ్2 మీద మరీ భారీ అంచనాలు లేవు కాని వెంకటేష్ అభిమానులు మాత్రం గట్టి నమ్మకంతో ఉన్నారు. నిన్న ట్రైలర్ విడుదలయ్యాక అంతా వెంకీ వన్ మ్యాన్ షోలా అనిపించడంతో వరుణ్ తేజ్ కు చెప్పుకోదగ్గ స్పేస్ దొరికిందా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి.

సీనియర్లు జూనియర్లను ఎవరిని తీసుకున్నా వెంకటేష్ కామెడీ టైమింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. చిరంజీవి కూడా ఇందులో సిద్ధహస్తుడైనప్పటికి మాస్ ఇమేజ్ కారణంగా ఒక పరిమితికి మించి ఎక్కువ ట్రై చేయలేరు. కాని వెంకీకి ఆ సమస్య లేదు. అందుకే నువ్వు నాకు నచ్చావ్ నుంచి మసాలా దాకా ఏ సినిమా చూసినా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎఫ్2 లో కూడా అదే కనిపిస్తోంది. వరుణ్ తేజ్ బాడీ లాంగ్వేజ్ కి కంప్లీట్ కామెడీకి అంతగా సెట్ కాదు.

అయితే అనిల్ రావిపూడి తనను పూర్తి తెలంగాణా యాసలో మాట్లాడించి ఏదో కొత్తగా అయితే ప్రయత్నించాడు. కాని అవతల వెంకటేష్ ఉండటంతో వరుణ్ ఎంత చేసినా సూర్యుడి ముందు టార్చ్ లైట్ వేసినట్టే అనే అభిప్రాయం అభిమానుల్లో వ్యక్తమవుతోంది. ట్రైలర్ లో అన్నపూర్ణ గారితో నీ తలకాయ్ అనే సీన్ చాలు వెంకీ కామిక్ సెన్స్ గురించి చెప్పడానికి. అందుకే వరుణ్ తేజ్ ఈ సవాల్ ను ఎలా స్వీకరించి మెప్పించాడనేది ఆసక్తికరంగా మారింది.