Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డులు, భార‌త‌ర‌త్న క‌ష్ట‌మా!

By:  Tupaki Desk   |   30 Jan 2019 4:48 AM GMT
జాతీయ అవార్డులు, భార‌త‌ర‌త్న క‌ష్ట‌మా!
X
టాలీవుడ్‌ లో ప్ర‌తిభావంతుల‌కు కొద‌వేం లేదు. అయితే ప్ర‌తిభావంతుల్లో సీనియ‌ర్ల‌కు జాతీయ అవార్డులు, భార‌త‌ర‌త్న వంటి ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన పుర‌స్కారాలు దూర‌మ‌వుతున్నాయా? అవి ఎప్ప‌టికీ అంద‌ని ద్రాక్ష అవుతున్నాయా? అందుకు రాజ‌కీయాల్లో నార్త్ డామినేష‌న్ ఒక‌ర‌కంగా కార‌ణం అని భావించాల్సి వ‌స్తోందా? అంటే అవున‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు ప‌లు మార్లు వేదిక‌ల‌పై ఈ విష‌యంపై ధ్వ‌జ‌మెత్తిన సంద‌ర్భాలున్నాయి. మ‌న ప్ర‌తిభ‌ను గుర్తించ‌క‌పోవ‌డానికి కార‌ణం కేంద్ర రాజ‌కీయాల్లో మ‌న బ‌లం స‌రిగా లేక‌పోవ‌డ‌మేన‌న్న వాద‌న‌ను ప‌లువురు వినిపించారు.

విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ .. అన్న‌గారు ఎన్టీఆర్ కి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌న్న డిమాండ్ ఎప్ప‌టినుంచో ఉంది. ఎన్టీఆర్ అభిమానులు చాలా కాలంగా కోరుతున్నా.. దానిని ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. కేంద్రానికి ఈ డిమాండ్ ఎంతో కాలంగా ఉన్నా మ‌న బ‌లం అక్క‌డ సున్నానే అయ్యింది. ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి, మంచు మోహ‌న్ బాబు, మెగాస్టార్ చిరంజీవి అంత‌టివారు ఎన్టీఆర్ కి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌న్న ఆకాంక్ష‌ను వెలిబుచ్చారు ప‌లు సంద‌ర్భాల్లో. ఇటీవ‌ల ఓ మీడియా స‌మావేశంలో ఎన్టీఆర్ వీరాభిమాని అయిన‌ ద‌ర్శ‌కుడు వైవియ‌స్ చౌద‌రి సైతం మీడియా ముఖంగా ఎన్టీఆర్ కి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని కోరారు. ఏ వేదిక‌పైకి వెళ్లినా ఆయ‌న ఎన్టీఆర్ ని స్మ‌రించి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌న్న ఆకాంక్ష‌ను వెలిబుచ్చుతూనే ఉంటారు. ఈ త‌ర‌హా ఎంద‌రో అభిమానులు కోర‌తారు. మూడు జాతీయ అవార్డులు, ప‌ద్మ‌శ్రీ‌, రాష్ట్ర ప‌తి అవార్డులు వ‌చ్చినా ఎన్టీఆర్ కి భార‌తర‌త్న రాలేదంటూ ఆ టాపిక్ ని అరిగిపోయిన క్యాసెట్ లా మ‌న మీడియా వంద‌ల సార్లు వేస్తూనే ఉంది. అయినా ప‌ట్టించుకున్న వాడే లేడు.

తాజాగా తెలుగు వాడు.. అన‌కాప‌ల్లి వాస్త‌వ్యుడు అయిన సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి ఇంత‌కాలం జాతీయ అవార్డు రాక‌పోవ‌డంపై ప‌లువురు అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. మేటి పాట‌ల ర‌చ‌యితగా 12 నందులు అందుకున్నారాయ‌న‌. ఎన్నో ఫిలింఫేర్ లు, స‌న్మానాలు, గౌర‌వాలు ఉన్నా.. ఆ ఒక్క‌టి అంద‌ని ద్రాక్ష‌నే అయ్యింది. అయితే సిరివెన్నెలకు `ప‌ద్మ‌శ్రీ‌` వ‌చ్చిన సంద‌ర్భంగా జాతీయ అవార్డు పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు చెబుతూ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి చెప్పారు. ``సిరివెన్నెల రాసిన `రుద్ర‌వీణ` పాట‌ల‌కే జాతీయ అవార్డు ద‌క్కాల్సింది. కానీ మిస్స‌య్యారు. `సైరా- న‌ర‌సింహారెడ్డి`కి ఆయ‌న ఎంతో ఉద్విగ్న‌త‌ను క‌లిగించే పాట‌లు రాస్తున్నారు. ఈసారి క‌చ్ఛితంగా జాతీయ అవార్డు వ‌స్తుంది`` అని వ్యాఖ్యానించారు. శ్రీ‌శ్రీ‌, వేటూరి, సుద్దాల అశోక్ తేజ‌ల‌కు జాతీయ అవార్డులు వ‌చ్చినా సిరివెన్నెల‌కు ఆ ఆకాంక్ష మాత్రం నెర‌వేర‌లేదు. చిరు చెప్పిన‌ట్టు ఈసారైనా ఆ ఒక్క‌టీ ద‌క్కుతుందేమో చూడాలి.