Begin typing your search above and press return to search.

ఎఫ్ 2 కథ అప్పటిదా బాసూ ?

By:  Tupaki Desk   |   27 Dec 2018 11:52 AM GMT
ఎఫ్ 2 కథ అప్పటిదా బాసూ ?
X
వచ్చే సంక్రాంతి సినిమాల్లో కామెడీనే నమ్ముకున్న మల్టీ స్టారర్ ఎఫ్ 2 మీద ఫ్యామిలీ ఆడియన్స్ కి మంచి అంచనాలు ఉన్నాయి. మాస్ కు ఎన్టీఆర్ - వినయ విధేయ రామ రూపంలో రెండు ఆప్షన్లు ఉండగా ఇవి చాలవు అన్నట్టు రజనికాంత్ పెట్ట రూపంలో మధ్యలోకి వచ్చేస్తున్నాడు. ఇది కూడా అవుట్ అండ్ అవుట్ మసాలా సినిమానే. అంటే ఓవరాల్ గా మాస్ కు లాస్ట్ ఛాయస్ గా నిలిచేది ఎఫ్ 2 నేనా అనే సందేహాలు ట్రేడ్ లో తలెత్తుతున్నాయి. ఇకపోతే ఎఫ్ 2 కథ మరీ కొత్తదేమీ కాదనే కొత్త వార్త హాట్ టాపిక్ గా మారింది.

అప్పుడెప్పుడో పాతికేళ్ళ క్రితం చంద్రమోహన్-సురేష్ (ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్) హీరోలుగా ఇంట్లో పిల్లి వీధిలో పులి అనే సినిమా ఒకటి వచ్చింది. అందులో బయట వీరాధివీరులుగా చెలామణి అయ్యే హీరోలు ఇంట్లో మాత్రం పెళ్ళాం దగ్గర చెప్పినట్టు వినే బుద్ధిమంతులుగా ఉంటూ నరకం చూస్తుంటారు. ఫస్ట్ హాఫ్ లో చంద్ర మోహన్ పాత్ర అలా ఉంటే సెకండ్ హాఫ్ లో సురేష్ కూడా అలాగే మారతాడు. తర్వాత పార్టనర్ ని వేధించడం కన్నా అర్థం చేసుకోవడం మిన్న అని తెలుసుకోవడంతో సుఖాంతమవుతుంది. పిఎన్ రామచంద్రరావు దీనికి దర్శకుడు.

ఎఫ్2 అచ్చంగా ఇదే లైన్ అని కాదు కాని మెయిన్ థీమ్ మాత్రం దాంతో కనెక్ట్ అవుతోంది. వెంకటేష్ తమన్నాను చేసుకున్నాక ఇంట్లో కష్టాలు మొదలవడం పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టుకుంటాను అని చెప్పుకు తిరిగే వరుణ్ తేజ్ ఆ తర్వాత మెహ్రీన్ వచ్చాక తనూ వెంకీ రూట్లలోనే వెళ్ళడం ఇదంతా టీజర్ లోనే చూపించేసారు. సో పెళ్ళానికి ఇద్దరు హీరోలు భయపడటం అనేది రెండు సినిమాల్లో కామన్ గా కనిపిస్తోంది. అసలే మాస్ సినిమాల మధ్య ఒకే ఒక్క కామెడీ సినిమాగా ఎఫ్ 2 వస్తోంది. అద్భుతంగా ఉంది అనే టాక్ వస్తే తప్ప వాటికి ధీటుగా నిలవడం సులభం కాదు. ఇవి చాలదు అన్నట్టు ఇలాంటి టాక్స్ ఎంతో కొంత ప్రభావం చూపించేవే. హ్యాట్రిక్స్ హిట్స్ తో జోరుమీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఎక్కువ మసాలా అంశాలు లేకుండా డీల్ చేసిన ఈ ఎంటర్ టైనర్ ఎంతవరకు మెప్పిస్తుందో వచ్చే నెల తేలిపోతుంది.