Begin typing your search above and press return to search.

ఆమె నాకు స్ఫూర్తి.. ఆమె బయోపిక్ లో నటించాలనుంది

By:  Tupaki Desk   |   30 Dec 2021 2:30 AM GMT
ఆమె నాకు స్ఫూర్తి.. ఆమె బయోపిక్ లో నటించాలనుంది
X
హర్నాజ్ సంధు.. కొన్ని వారాల క్రితం వరకు ఈ పేరు చాలా మందికి తెలియదు. ఇండియాలో అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ పేరు... ఇండస్ట్రీలో ఉన్న వారిలో కూడా చాలా మందికి తెలియని ఈ పేరు.. మోడలింగ్‌ రంగంలో కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఈ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ పేరు గురించి నెట్‌ లో ప్రతి ఒక్కరు సెర్చ్‌ చేసి ఆమె గురించి తెలుసుకోవడం.. ఆమె అందంను చూసేందుకు ఆసక్తి చూపించడం కనిపిస్తుంది. ఇంతటి పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న మిస్‌ యూనివర్శ్‌ హర్నాజ్ సంధు హీరోయిన్ గా బిజీ అవ్వాలని ఆశ పడుతుంది. మిస్ ఇండియా.. మిస్ యూనివర్శ్‌ అయిన వారు ఇండస్ట్రీలో ముఖ్యంగా బాలీవుడ్‌ లో సినిమాలు చేయాలని ఆశ పడటం చాలా కామన్‌ విషయం.

తాజాగా మిస్ యూనివర్శ్‌ గా నిలిచిన మన భారతీయురాలు అయిన హర్నాజ్ సంధు కూడా సినిమాల్లో స్టార్‌ అవ్వాలని ఆశ పడుతున్నట్లుగా పేర్కొంది. గతంలో ఈమె కొన్ని సినిమాల్లో నటించడంతో పాటు ప్రస్తుతం కూడా ఒకటి రెండు సినిమాల్లో నటిస్తూనే ఉంది. హర్నాజ్ సంధు బాలీవుడ్‌ లో నటించాలని ఆశ పడుతుందట. మిస్ యూనివర్శ్‌ గా నిలిచిన తర్వాత హర్నాజ్ రెగ్యులర్‌ గా జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెల్సిందే. తాజాగా ఈమె ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ షారుఖ్‌ ఖాన్‌ తో నటించాలి.. ఆయన అంటే చిన్నప్పటి నుండి అభిమానం.. అంటూ చెప్పుకొచ్చింది. ఇక హీరోయిన్స్ లో ప్రియాంక చోప్రా అంటే చాలా ఇష్టం అన్నట్లుగా ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

ప్రియాంక కెరీర్‌ లో సక్సెస్‌ అయిన తీరు మాత్రమే కాకుండా ఆమె వ్యక్తిగత జీవితం కూడా ఇష్టం.. ఆమె జీవితంలో అనుకున్నది చేసుకుంటూ వెళ్లారు.. ఆమె ఎంతోమందికి ఆదర్శ ప్రాయంగా నిలిచారు. సినిమా ఇండస్ట్రీలో మరియు బయట అన్ని విధాలుగా ఆమె విజయాలను దక్కించుకున్నారు. అందుకే ఆమె నాకు స్ఫూర్తి. ఆమెను ప్రతి విషయంలో కూడా నేను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాను.. ముందు ముందు కూడా ఆమె స్ఫూర్తిగా ముందుకు వెళ్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అవకాశం వస్తే తప్పకుండా ఆమె బయోపిక్ లో నటిస్తాను అంటూ హర్నాజ్ చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడికి ప్రియాంక చోప్రా బయోపిక్ ఛాన్స్ వచ్చేనా అనేది చూడాలి.