Begin typing your search above and press return to search.

'గబ్బర్ సింగ్' దర్శక నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం...?

By:  Tupaki Desk   |   14 May 2020 8:10 PM IST
గబ్బర్ సింగ్ దర్శక నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం...?
X
'గబ్బర్ సింగ్' దర్శక నిర్మాతలు హరీష్ శంకర్ - బండ్ల గణేష్‌ల మధ్య వివాదం ముదురుతున్నట్లు ప్రముఖ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. ఇటీవలే 'గబ్బర్ సింగ్' మూవీ విడుదలై 8 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా అందరికీ కృతఙ్ఞతలు చెప్తూ హరీష్ శంకర్ ట్విట్టర్ లో ఒక లెటర్ విడుదల చేసాడు. అయితే ఆ లెటర్ లో నిర్మాత బండ్ల గణేష్ పేరు మరియు హీరోయిన్ శృతిహాసన్ పేర్లు మాత్రం ప్రస్తావించలేదు. గబ్బర్ సింగ్ సెలబ్రేషన్స్ సంగతి అటుంచితే ఈ వివాదం ముదురుతూ వస్తోందని.. ఈ విషయంపై ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా రియాక్ట్ అయ్యాడని.. హరీష్ శంకర్ మీ పేరును ప్రస్తావించలేదు కదా.. మీ ఇద్దరి మధ్య ఏవైనా మనస్పర్థలు వచ్చాయా.. అని బండ్ల గణేష్‌ ను అడుగగా ఆయన హరీష్‌ పై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడని న్యూస్ స్ప్రెడ్ అయింది.

ప్రముఖ మీడియాలలో వచ్చిన వార్తల ప్రకారం బండ్ల గణేష్ మాట్లాడుతూ ''హరీష్ శంకర్ ని పవర్ స్టార్ కి ఇంట్రడ్యూస్ చేసింది నేను. ఎన్టీఆర్ సినిమా ఇస్తానన్న నల్లమలపు బుజ్జి కూడా సినిమా ఇవ్వకపోవడంతో డిప్రెషన్‌ లో ఉంటే పిలిచి మరీ అవకాశం వచ్చేలా చేశాను. 'మిరపకాయ్' సినిమాని పవన్ కళ్యాణ్ - హరీష్ కాంబోలో తీయాలని అనుకున్నాను. కానీ వర్క్ అవుట్ అవ్వలేదు. దీంతో హరీష్ ఆ సినిమాని రవితేజ హీరోగా వేరే ప్రొడ్యూసర్ తో తీసాడు. కానీ పవన్ కళ్యాణ్ హరీష్ ని గుర్తుపెట్టుకొని 'దబాంగ్' రీమేక్ ఆయన చేతిలో పెడదామని సలహా ఇచ్చాడు. ఈ విధంగా ఎలాంటి ఛాన్సెస్ లేక డిప్రెషన్ లో ఉన్న హరీష్ 'గబ్బర్ సింగ్' ప్రాజెక్ట్ లోకి వచ్చాడు. కానీ ఆయన నన్ను మర్చిపోవడం ఆయన సంస్కారం'' అని సమాధానం ఇచ్చాడట. అంతేకాకుండా ''హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను మాత్రమే హ్యాండిల్ చేయగలడని.. హరీష్ శంకర్ డైరెక్ట్ స్ట్రైట్ సినిమా తీసి హిట్ కొడితే నేను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడట. అయితే ఇప్పుడు తాజాగా బండ్ల వ్యాఖ్యలపై హరీష్ శంకర్ సన్నిహితుల దగ్గర రియాక్ట్ అయ్యాడని కూడా న్యూస్ వచ్చింది.

''గబ్బర్‌ సింగ్ ఆఫర్‌ నాకు పవన్ కల్యాణ్ ఇచ్చారు. మొదట ఈ సినిమాను నాగబాబు నిర్మించాలనుకున్నారు. బండ్ల గణేష్ కాదు. ఇక్కడ ఎవరి క్రెడిబులిటీ ఏంటి.. ఎవరింటికి ఎవరు వెళ్లారో.. ఎవరు ఏమి చేస్తామన్నారో అందరికీ తెలుసు. క్రెడిబులిటీ లేని వ్యక్తుల గురించి మాట్లాడి నేను టైమ్ వేస్ట్ చేసుకోను. నేను ఏ విధంగా కెరీర్ మొదలెట్టానో.. నాకు ఫస్ట్ బ్రేక్ ఎవరిచ్చారో అందరికి తెలుసు. నేను నా కెరీర్ ని సినీ ఇండస్ట్రీలో మొదలెట్టా.. సాఫ్ట్ వేర్ కంపెనీలో కాదు. నా మొదటి సినిమా షాక్ 2006 లో రిలీజ్ అయ్యింది. ఆయన మొదట సినిమా ఆంజనేయులు 2009లో రిలీజ్ అయ్యింది. ఎవరు ఎవరికి లైఫ్ ఇచ్చారు. మిరపకాయ్‌ - సుబ్రమణ్యం ఫర్ సేల్ - దువ్వాడ జగన్నాథమ్‌ నా కెరీర్‌ లో కమర్షియల్ హిట్‌ లుగా నిలిచాయి. చిన్న చిన్న కామెంట్లను నేను పెద్దగా పట్టించుకోను. గబ్బర్‌ సింగ్‌ సినిమాలోని తక్కువ నిడివి ఉన్న బ్రహ్మానందం డైలాగ్‌ లను నా అసిస్టెంట్ రాజశేఖర్‌ రాశారు. దానికి టైటిల్‌ కార్డులో ఆయన పేరును వేశాను. అది నా క్రెడిబిలిటీ. నేను హడావిడిలో నా ట్వీట్ లో బండ్ల గణేష్ పేరు మర్చిపోయా.. కానీ ఆ తర్వాత నా తప్పు తెలుసుకొని ట్వీట్ చేశా'' అని హరీష్ శంకర్ తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నట్లు ప్రముఖ ప్రసార మాధ్యమాలలో ప్రచురితమైంది.

వాస్తవానికి ''బండ్ల అన్నందుకు అయినా బ్లాక్ బస్టర్ కొట్టు బ్రో' అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా.. దానికి హరీష్ శంకర్ రిప్లై ఇస్తూ ''ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక వ్యక్తికి ఇచ్చే సమాధానం కాదు.. దాని పట్ల మనకున్న ఫ్యాషన్. దీనికి మనకు మనమే సమాధానం చెప్పుకోవాలి.. ఇతరులకు కాదు'' అని ట్వీట్ చేసాడు. అంతేకాకుండా రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి (మచ్చ రవి) ట్వీట్ చేస్తూ.. ''హరీష్ బావా.. నువ్వు తీసిన అన్ని సినిమాలను చూశాం. రవితేజ అన్నయ్య తో 'మిరపకాయ్', సాయిధరమ్ తేజ్ తో 'సుబ్రమణ్యం ఫర్ సేల్', అల్లు అర్జున్ తో 'దువ్వాడ జగన్నాథమ్‌' మాకు నచ్చాయి. ఇతర భాషల నుండి నువ్వు ఇష్టపడిన కథలతో పాటు అలాంటి హార్ట్ ఫుల్ ఎంట్రర్టైనెర్స్ కూడా రాయాలని కోరుకుంటున్నాం'' అని ట్వీట్ చేసాడు. దీనిని రీట్వీట్ చేసిన హరీష్.. ''థ్యాంక్యూ బావా.. నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను'' అని రిప్లై ఇచ్చాడు.