Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లు మళ్లీ మొదలు..!

By:  Tupaki Desk   |   30 April 2022 10:01 AM IST
హరిహర వీరమల్లు మళ్లీ మొదలు..!
X
పవన్ కళ్యాణ్‌ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ కార్యక్రమాలు కరోనా ఇతర కారణాల వల్ల సుదీర్ఘ కాలం పాటు బ్రేక్ పడింది. ఎట్టకేలకు ఇటీవలే షూటింగ్ ను పునః ప్రారంభించారు. భారీ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చిన్న మేకింగ్‌ వీడియోను కూడా మేకర్స్‌ అధికారికంగా విడుదల చేసిన విషయం తెల్సిందే.

దర్శకుడు క్రిష్ రెండు రోజుల క్రితం ఆ షెడ్యూల్‌ ను ముగించినట్లుగా ప్రకటించాడు. పవన్ కళ్యాణ్ భారీ యాక్షన్ సన్నివేశాన్ని పది రోజుల పాటు చేయడం జరిగిందట. ఇక తదుపరి షెడ్యూల్‌ పనులు అప్పుడే మొదలు అయ్యాయి. మే రెండవ వారంలో పవన్‌ కళ్యాణ్ తో పాటు ఇతర నటీ నటులపై టాకీ పార్ట్‌ ను చిత్రీకరించబోతున్నారట. అందుకు సంబంధించిన పనులు మొదలు అయ్యాయి.

హరి హర వీరమల్లు సినిమా లోని కీలక సన్నివేశాలు బ్యాక్ టు బ్యాక్ మెల్ల మెల్లగా చిత్రీకరణ పూర్తి చేస్తూ ఉన్నారు. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్‌ నెలకు పూర్తి చేయాలని క్రిష్ పట్టుదలతో ఉన్నాడట. పవన్‌ కళ్యాణ్ కూడా అందుకు తగ్గట్లుగా డేట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాడని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్‌ కు చెందిన ఇద్దరు ముద్దుగుమ్మలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మొగలాయిల కాలం నాటి కథ పూర్తి గా కల్పిత కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. పవన్‌ కళ్యాణ్ కెరీర్‌ లో మొదటి సారి ఇలాంటి ఒక విభిన్నతరహా సినిమాలో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.

పవన్‌ కళ్యాణ్ ఇటీవలే భీమ్లా నాయక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకు ముందు వకీల్‌ సాబ్‌ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక హరి హర వీరమల్లు సినిమా తో పవన్ హ్యాట్రిక్‌ కొట్టేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

క్రిష్ సినిమా తర్వాత పవన్‌ సుజీత్‌ దర్శకత్వంలో తేరీ రీమేక్ చేస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. మరో వైపు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమాను చేయాల్సి ఉంది. ఆ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది కాని షూటింగ్‌ మొదలు పెట్టడానికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.