Begin typing your search above and press return to search.

మెగాస్టార్ యాక్షన్ కి కట్ చెప్పాలంటే కష్టమే!

By:  Tupaki Desk   |   2 Jan 2022 9:33 AM GMT
మెగాస్టార్ యాక్షన్ కి కట్ చెప్పాలంటే కష్టమే!
X
చిరంజీవి హీరోగా ఒక సినిమా చేసే అవకాశం కోసం ఎంతోమంది దర్శకులు ఎదురుచూస్తుంటారు. ప్రతిభతో పాటు అదృష్టం కూడా తోడైనవారికే ఆయనతో సినిమా చేసే అవకాశం లభిస్తుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి అవకాశాన్ని అందుకోవడం కోసం టాలీవుడ్ లోని దర్శకులంతా వేయికళ్లతో ఎదురుచూస్తుంటే, తమిళ దర్శకుడు మోహన్ రాజాకి మాత్రం అలాంటి అరుదైన అవకాశం లభించింది. మెగాస్టార్ హీరోగా ఆయన 'గాడ్ ఫాదర్' సినిమాను రూపొందిస్తున్నాడు. మలయాళంలో భారీ విజయాన్ని నమోదు చేసిన 'లూసిఫెర్'కి ఇది రీమేక్.

మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఈ సినిమాకి మంచి వసూళ్లతో పాటు ప్రశంసలు కూడా దక్కాయి. ఇది ఆయన వయసుకి .. క్రేజ్ కి తగిన పాత్ర. అందువల్లనే ఈ కథను రీమేక్ చేయడానికి చిరంజీవి ఆసక్తిని కనబరిచారు. మోహన్ రాజా అయితే ఈ తరహా కథలను బాగా హ్యాండిల్ చేస్తాడనే ఉద్దేశంతో ఆయనను పిలిచి మరీ అవకాశం ఇచ్చారు. మోహన్ రాజాకి దర్శకుడిగా మంచి అనుభవం ఉంది. 'హనుమాన్ జంక్షన్' సినిమాతో చాలా కాలం క్రితమే ఆయన తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'తనీ ఒరువన్' సినిమాతో మెగాస్టార్ కళ్లలో పడ్డాడు.

ఇటీవలే చిరంజీవిని తీసుకుని సెట్స్ పైకి వెళ్లిన మోహన్ రాజా .. పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో చకచకా షూటింగును కానిచ్చేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'లూసిఫెర్' మూలకథను తీసుకున్నాము .. చిరంజీవి క్రేజ్ కి తగినట్టుగా మార్పులు చేశాము. అలాగే నేటివిటీని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళుతున్నాము. ముందుగా చిరంజీవిగారికి సంబంధించిన పోర్షన్ పైనే దృష్టిపెట్టాము. ఇంతవరకూ 45 రోజుల పాటు జరిగిన చిత్రీకరణతో 45 శాతం షూటింగును పూర్తి చేశాము. 2 యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి.

ఈ నెల అంతా కూడా షూటింగు పెట్టుకున్నాము. ముందుగా ప్లాన్ చేసుకున్నట్టుగానే కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. వచ్చేనెలలో క్లైమాక్స్ తో పాటు 2 పాటల చిత్రీకరణ ఉంటుంది. దాంతో ఈ సినిమా షూటింగు పార్టు అంతా కూడా పూర్తవుతుంది. ఇక చిరంజీవిగారి యాక్షన్ ను ప్రత్యక్షంగా చూడటం ఇదే మొదటిసారి. ఆయన యాక్ట్ చేస్తుంటే ఒక్కోసారి కట్ చెప్పడం మరిచిపోయి అలా చూస్తుండిపోతున్నాను. ఆయనతో ఒక్కో రోజు ఒక్కో జ్ఞాపకంగా మారిపోతోంది. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. మెగా అభిమానుల అంచనాలనకి తగినట్టుగా ఈ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో నయనతార కీలకమైన పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.