Begin typing your search above and press return to search.

OTT కంటే 50 శాతంతో థియేట‌ర్లే బెట‌ర్

By:  Tupaki Desk   |   16 April 2021 3:30 AM GMT
OTT కంటే 50 శాతంతో థియేట‌ర్లే బెట‌ర్
X
సెకండ్ వేవ్ ప్ర‌భావంతో మ‌రోసారి తెలుగు సినిమాల‌న్నీ ఓటీటీల‌కు క్యూ క‌డ‌తాయ‌ని ఊహాగానాలు సాగుతున్నాయి. పెరుగుతున్న క‌రోనా కేసుల ప్ర‌భావంతో ప్ర‌భుత్వాలు 50శాతం ఆక్యుపెన్సీ నియ‌మం విధిస్తాయ‌ని భావిస్తున్నారు. అయితే పెద్ద సినిమాలేవీ 50శాతం తో ఆడ‌వా? అంటే ఇంత‌కుముందు క్రాక్ సినిమా 50శాతం వ‌సూళ్ల‌తోనే పెద్ద విజ‌యం అందుకుంది. ఇక్క‌డ శాతం స‌మ‌స్య కాద‌ని ప్రూవైంది.

ఒక‌వేళ క‌రోనాకి భ‌య‌ప‌డి జ‌నం థియేట‌ర్ల‌కు రాక‌పోవ‌డం అనే స‌మ‌స్య ఉందా? అంటే ఓవైపు సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఇప్ప‌టి ప‌రిస్థితిలోనే వ‌కీల్ సాబ్ వ‌చ్చి బంప‌ర్ హిట్ కొట్టింది. ఇటీవ‌ల ఉప్పెన‌- జాతిర‌త్నాలు క‌రోనా భ‌యాల న‌డుమ సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టాయి. సినిమాకి ఉండే క్రేజును బ‌ట్టి జ‌నం హుషారుగానే థియేట‌ర్ల‌కు వస్తున్నార‌ని వ‌కీల్ సాబ్ తో పాటు ఆ చిన్న సినిమాలు కూడా నిరూపించిన‌ప్పుడు త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌కు ఎందుకు రారు? అన్న లాజికల్ ప్ర‌శ్న‌ ఎదుర‌వుతోంది.

పాన్ ఇండియా స్థాయిలో అన్నిచోట్లా త‌మ సినిమాని ఆడించాలి అనుకున్న‌వారంతా కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారు. త‌మ సినిమాల్ని కొన్నాళ్లు వాయిదా వేసుకుంటే ఉప్పెన త‌ర‌హా మ్యాజిక్ సాధ్య‌మ‌వుతుంద‌ని భావిస్తూ ఉండి ఉండొచ్చు. ఇక‌పోతే ఇప్పుడున్న క‌ష్ట కాలంలో ఓటీటీకి అమ్ముకోవాలా? లేక థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాలా? అంటే ఇప్పుడు ప్ర‌భుత్వాల నిర్ణ‌యంపైనే ప్ర‌తిదీ ఆధార‌ప‌డి ఉంది. ఓవైపు ఏపీలో క‌రోనా పెరిగినా కానీ స‌హ‌జీవ‌నం త‌ప్ప‌ద‌ని సీఎం జ‌గ‌న్ స్ప‌ష్ఠంగా చెప్పారు. అంటే ఆర్థిక‌ప‌రిస్థితిని కిందికి దించేసే లాక్ డౌన్ లు ఏపీలో ఉండ‌వ‌న్న‌ది స్ప‌ష్ఠ‌మైంది.

మ‌రోవైపు తెలంగాణ‌లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌తో మాట్లాడి ఏదో ఒక‌టి నిర్ణ‌యించుకోవాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ సిద్ధ‌మ‌వుతున్నార‌ని స‌మాచారం. ఇక్క‌డా లాక్ డౌన్ ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం ఇంత‌కుముందే స్ప‌ష్ఠం చేసింది. అయితే సినిమాల‌కు నియ‌మ‌నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. 50శాతం సీటింగ్ తో థియేట‌ర్లు కొన‌సాగుతాయి. ప‌రిస్థితి మ‌రీ తీవ్ర‌మైతే వారం ప‌దిరోజుల పాటు థియేట‌ర్లు బంద్ చేయ‌మ‌ని ఆదేశించ‌వ‌చ్చు మిన‌హా నెల‌ల పాటు మూసేయాల‌న్న నిర్ణ‌యం ఉండ‌ద‌నే ఊహిస్తున్నారు. మ‌రి ఇలాంటి స‌న్నివేశంలో 50శాతం సీటింగుతో సినిమాల్ని ర‌న్ చేస్తే త‌ప్పు కాద‌న్న వాద‌నా వినిపిస్తోంది. ఓటీటీల కంటే 50శాతం తో థియేట‌ర్ల‌లో ఆడితేనే గౌర‌వం అన్న వాళ్లే ఎక్కువ‌. అలాగే తెలంగాణ‌లో ఒక‌లా ఆంధ్రాలో ఒక‌లా కాకుండా రెండు చోట్లా ప‌రిశ్ర‌మ‌కు స‌పోర్ట్ కావాల‌ని.. టిక్కెట్టు ధ‌ర‌లు స‌హా ప్ర‌తిదీ రెండు చోట్లా ఒకేలా ఉండేలా ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కూడా నిర్మాత‌లు కోరుకుంటున్నారు.