Begin typing your search above and press return to search.

'హ్యాపీ బర్త్ డే' ఫన్ బ్లాస్టింగ్ టీజర్: ఇంటింటికీ గన్నూ.. ఎదురులేని ఫన్నూ..!

By:  Tupaki Desk   |   7 Jun 2022 6:26 AM GMT
హ్యాపీ బర్త్ డే ఫన్ బ్లాస్టింగ్ టీజర్: ఇంటింటికీ గన్నూ.. ఎదురులేని ఫన్నూ..!
X
అందాల భామ లావణ్య త్రిపాఠి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ క్రైమ్ కామెడీ ''హ్యాపీ బర్త్ డే''. 'మత్తు వదలరా' ఫేమ్ రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్ ప్రతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన 'హ్యాపీ బర్త్ డే' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. బ్యూటిఫుల్ లావణ్య త్రిపాఠి ఒక విలక్షణమైన పాత్రలో నటించినట్లు హింట్ ఇచ్చింది. టైటిల్ సాఫ్ట్ గా అనిపించినా పోస్టర్ థీమ్ మాత్రం చాలా భిన్నంగా ఆకర్షణీయంగా అనిపించింది.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'హ్యాపీ బర్త్ డే' సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ ని మేకర్స్ ఆవిష్కరించారు. 'ఆయుధాల చట్టం అంటే ఏంటి సుయోధనా?' అని అడగ్గా.. 'ఇంటింటికీ గన్నూ.. ఎదురులేని ఫన్నూ' అని చెప్పడంతో ఈ టీజర్ ప్రారంభమైంది.

టెన్త్ ఫెయిల్ అయినా గన్ బిల్ మాత్రం పాస్ చేసి తీరుతానని కేంద్ర మంత్రి వెన్నెల కిషోర్ ఒక ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. ఇది తుపాకీ కొనుగోలు, అమ్మకం, తయారీ మరియు వినియోగాన్ని నియంత్రించడానికి ఉద్దేశించిన చట్టం. పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందడంతో దేశంలో తుపాకీ సంస్కృతికి తెరలేపింది.

ఆయుధాలకు ఆకర్షితులై తుపాకీ బజార్లకు జనం పోటెత్తారు. ఈలోగా తుపాకీల నేపథ్యంతో పుట్టినరోజు పార్టీని నిర్వహిస్తారు. గన్ లేకుండా పార్టీలోకి ప్రవేశం లేదు. అయితే పార్టీ కోసం ఒక ప్రత్యేక బృందం రావడంతో రెండు పార్టీల మధ్య భారీ కాల్పులు జరిగాయి. కాన్సెప్ట్ ఎంత క్రేజీగా ఉందో.. ఎగ్జిక్యూషన్ కూడా క్రేజీగా ఉంది.

రితేష్ రానా సృష్టించిన ఈ కల్పిత ప్రపంచంలో ప్రతి ఫ్రేమ్ లో కొన్ని క్రేజీ సంఘటనలను చూడొచ్చు. పాత్రలు కూడా అసాధారణంగా పరిచయం చేయబడ్డాయి. లావణ్య త్రిపాఠి పోల్ డ్యాన్స్ - నరేష్ అగస్త్య మిస్టీరియస్ ఎక్స్ ప్రెషన్స్ - పార్టీలో తుపాకీ కాల్పుల మధ్య సత్య స్టైలిష్ వాక్ మరియు గులాబీ రేకులతో వెన్నెల కిషోర్ టబ్ బాత్.. ఇలా అన్నీ ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ఇది డైరెక్టర్ రితేష్ రానా మార్క్ సర్రియల్ కామెడీ థ్రిల్స్ మరియు యాక్షన్ తో కూడిన సినిమా అని అర్థం అవుతుంది. సంగీత దర్శకుడు కాళ భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తన మార్క్ చూపించగా.. సురేష్ సారంగం కెమెరా పనితనం ప్రశంసనీయంగా ఉంది. నార్ని శ్రీనివాస్ ఆర్ట్ డైరెక్టర్ గా.. శంకర్ ఉయ్యాల స్టంట్ మాస్టర్ గా వర్క్ చేశారు.

'హ్యాపీ బర్త్ డే' టీజర్ ఈ క్రేజీవరల్డ్ లోకి ఎంట్రీ మాత్రమే. మొత్తం పార్టీని చూసేందుకు జూలై 15 వరకు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే అదే రోజు ఈ పాన్ తెలుగు ఫిలిం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని & రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ) మరియు హేమలత పెదమల్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.