Begin typing your search above and press return to search.

టాలీవుడ్ రాజకుమారుడు .. మహేశ్ బాబు(బర్త్ డే స్పెషల్)

By:  Tupaki Desk   |   9 Aug 2021 2:22 AM GMT
టాలీవుడ్ రాజకుమారుడు .. మహేశ్ బాబు(బర్త్ డే స్పెషల్)
X
మహేశ్ బాబు .. ఇప్పుడు ఒక పేరు కాదు. ఎంతోమంది అభిమానులు ప్రేమతో జపించే పవర్ఫుల్ మంత్రం. టాలీవుడ్ లోని హ్యాండ్సమ్ హీరోల్లో మహేశ్ ముందువరుసలో కనిపిస్తాడు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ .. కామెడీ ఇలా ఏ అంశంలో నైనా తనకి తిరుగులేదనిపిస్తాడు. చైల్డ్ ఆర్టిస్టుగా నటనపై పూర్తి అవగాహన వచ్చిన తరువాతనే ఆయన హీరోగా కెమెరాముందుకు వచ్చాడు. 'నీడ' అనే సినిమాతో చైల్డ్ ఆరిస్టుగా ఆయనను దాసరి నారాయణరావు పరిచయం చేస్తే, 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా రాఘవేంద్రరావు పరిచయం చేయడం విశేషం.

బాలనటుడిగా ముద్దుగా .. బొద్దుగా కనిపించిన మహేశ్, హీరోగా ఎంట్రీ ఇచ్చే సమయానికి చాకులాంటి కుర్రాడిగా మారిపోయాడు. నిజంగానే రాజకుమారుడు మాదిరిగానే ఉన్నాడని ప్రేక్షకులు చెప్పుకున్నారు. కుర్రాళ్లంతా ఇక ఆలస్యం చేయకూడదన్నట్టుగా ఆయన అభిమానులుగా మారిపోయారు. సూపర్ స్టార్ వారసుడిగా అడుగుపెడుతున్నాడు గనుక, భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదలైంది. ఎర్రగా .. బుర్రగా కనిపిస్తూ అమ్మాయిల మనసులు దోచేసిన ఈ బుల్లోడు, ఫైట్లలో .. డాన్సుల్లో దుమ్మురేపేస్తూ యువకుల్స్ ను ఆకట్టుకున్నాడు.

తొలి సినిమాను 100 రోజుల దిశగా పరుగులు తీయించిన మహేశ్ బాబు. ఆ తరువాత 'మురారీ' .. 'టక్కరి దొంగ' సినిమాలు చేసినప్పటికీ, 'ఒక్కడు' సినిమా సంచలన విజయాన్ని సాధించిపెట్టింది. మహేశ్ లోని యాక్షన్ హీరోని పూర్తిస్థాయిలో ఆవిష్కరించిన సినిమా ఇది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, స్టార్ హీరోల సరసన ఆయన ప్లేస్ ను సెట్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన 'అతడు' .. పూరి కాంబినేషన్లో చేసిన 'పోకిరి' సినిమాలు మహేశ్ స్థానాన్ని .. స్థాయిని మరింత పదిల పరిచయాయి.

'పోకిరి' సినిమా మాస్ ఆడియన్స్ కి మహేశ్ బాబును మరింత చేరువ చేసింది. ఈ సినిమాలో అటు యాక్షన్ ను ఇటు కామెడీని తనదైన స్టైల్లో మహేశ్ కలిపి నడిపించిన తీరు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. దాంతో ఆయన కెరియర్లో గుర్తుపెట్టుకోదగిన సినిమాగా ఇది నిలిచింది. ఇక 2011 నుంచి 2013 వరకూ మహేశ్ చేసిన 'దూకుడు' .. 'బిజినెస్ మేన్' .. ' సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలు ఆయనకు హ్యాట్రిక్ హిట్ ను ముట్టజెప్పాయి. ఈ మూడు సినిమాలకు భిన్నంగా ఆయనను 'శ్రీమంతుడు'లో చూపించిన కొరటాల, బ్లాక్ బస్టర్ హిట్ ను ఆయన ఖాతాలో జమచేశాడు.

ఇక 2018 నుంచి 2020లోగా ఆయన మరోసారి హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాల జాబితాలో 'భరత్ అనే నేను' .. 'మహర్షి' .. 'సరిలేరు నీకెవ్వరు' కనిపిస్తాయి. విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు ఆయనకు ఈ విజయాలను అందించాయి. ఆయన క్రేజ్ ను .. మార్కెట్ ను మరింతగా పెంచాయి. ఇలా ఆయన కెరియర్ ను ప్రభావితం చేసిన .. పరుగులు తీయించిన దర్శకుల జాబితాలో రాఘవేంద్రరావు .. గుణశేఖర్ .. త్రివిక్రమ్ .. పూరి .. కొరటాల కనిపిస్తారు. మహేశ్ ఇప్పుడు హీరోగానే కాదు .. నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 'సర్కారువారి పాట' చేస్తున్నాడు. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని విజయాలను అందుకోవాలని మనసారా కోరుకుందాం.