Begin typing your search above and press return to search.

శంకర్ ప్ర్రతి సినిమా ఓ ప్రయోగమే .. ఓ సంచలనమే (బర్త్ డే స్పెషల్)

By:  Tupaki Desk   |   17 Aug 2021 3:54 AM GMT
శంకర్ ప్ర్రతి సినిమా ఓ ప్రయోగమే .. ఓ సంచలనమే (బర్త్ డే స్పెషల్)
X
ఒకప్పుడు దక్షిణాది ప్రేక్షకులు భారీ సినిమాలు తీయడం బాలీవుడ్ దర్శకుల వల్లనే అవుతుందని అనుకునేవారు. అబ్బురపరిచే సినిమాలను హాలీవుడ్ వారు మాత్రమే చేయగలరు అని చెప్పుకునే వారు. మెగాఫోన్ పట్టుకుని తాను అడుగుపెడుతూనే అలాంటి పరిస్థితిని పూర్తిగా మార్చేసిన దర్శకుడిగా శంకర్ కనిపిస్తారు. 1993లో 'జెంటిల్ మేన్' సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమయ్యారు. కొత్త కుర్రాడు .. ఉత్సాహంతో ఏదో ట్రై చేసే ఉంటాడని అంతా అనుకున్నారు. అలాంటి వాళ్లంతా సినిమా చూసి షాక్ అయ్యారు.

అప్పటివరకూ తెరపై వాళ్లు చూసిన సినిమాలు వేరు .. వాటి పోకడ వేరు. కానీ 'జెంటిల్ మేన్' అలా కాదు. కథ ... స్క్రీన్ ప్లే .. పాత్రలను మలిచిన విధానం .. రీ రికార్డింగ్ లో కొత్తదనం .. సంగీతం .. పాటలు .. ఫైట్లు .. డాన్సులు ఇలా ప్రతి విషయంలో .. ప్రతి అంశంలో ఆయన కొత్తదనాన్ని చూపించారు. దాంతో ఆ సినిమా ఏ భాషలో విడుదలైతే ఆ భాషలో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తూ వెళ్లింది. దాంతో మొదటిసారిగా అందరిలో తలెత్తిన ఒకే ఒక ప్రశ్న 'ఎవరు ఈ శంకర్?'. అందరూ కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

కొంతమంది మాత్రం .. "ఏదో టైమ్ బాగుండి ఆ సినిమాకు అన్నీ కలిసొచ్చాయి .. మరో సినిమా చేస్తేనే గాని ఆయన గారి టాలెంటును గురించి ఏమీ చెప్పలేం " అని గుసగుసలాడుకున్నారు. శంకర్ మాత్రం విమర్శలను మాత్రమే కాదు .. ప్రశంసలను కూడా పట్టించుకోకుండా తనపని తాను చేస్తూ వెళ్లారు. ఈ సారి ఆయన మరో సాహసం చేశాడు. తన మొదటి సినిమాలో డాన్సర్ గా ఒక పాటలో మెరిసిన ప్రభుదేవాను, 'ప్రేమికుడు' సినిమాలో హీరోగా తీసుకున్నారు. బహుశా ఇది శంకర్ కి మాత్రమే చెల్లిందేమో. ఇక రికార్డుల పరంగా ఈ సినిమా చేసిన సందడి కూడా అంత ఇంతా కాదు.

ఆ తరువాత శంకర్ నుంచి వచ్చిన 'భారతీయుడు' సినిమా, భారతదేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసింది. తాను ఎంచుకున్న కథ పట్ల శంకర్ ఎంత నమ్మకంగా ఉంటాడు? కథనాన్ని నడిపించడంలో ఆయన ప్రత్యేకత ఏమిటి? పాత్రల రూపకల్పనలో ఆయన చూపించే కొత్తదనం ఎలా ఉంటుందనేది అందరికీ అర్థమైంది. ట్యూన్లు చేయించుకోవడంలోను .. రాయించుకోవడంలోను, ఫైట్లు కంపోజ్ చేయించుకోవడంలోను ఆయనకి ఎంత అవగాహన ఉందనేది వారికి స్పష్టమైంది. ఇక ఆ తరువాత కూడా 'జీన్స్' .. 'ఒకే ఒక్కడు' .. 'అపరిచితుడు' వంటి సంచలనాలతో ఆయన తన ప్రయాణాలను కొనసాగించారు.

'జీన్స్' సినిమా చూస్తే .. ఇంతవరకూ ద్విపాత్రాభినయాన్ని ఆ స్థాయిలో తీసినవాళ్లెవరూ కనిపించరు. అలాగే 'రోబో' చూస్తే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మీద ఆయనకి ఎంతటి అవగాహన ఉందనేది అర్థమవుతుంది. నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే, ఆయనపై వాళ్లకి ఏ స్థాయిలో నమ్మక ఉందో ఊహించుకోవచ్చు. తాను అనుకున్నది తెరపై చూపించాడనికి ఆయన ఒక తపస్సునే చేస్తారు. దక్షిణాది సినిమాను ప్రపంచ పటానికి పరిచయం చేసిన శంకర్, ప్రస్తుతం చరణ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజున శంకర్ పుట్టినరోజు .. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని విజయాలను అందుకోవాలని మనసారా కోరుకుందాం.