Begin typing your search above and press return to search.

అప్సరసలు అసూయపడే అందమే హన్సిక: (బర్త్ డే స్పెషల్)

By:  Tupaki Desk   |   9 Aug 2021 7:56 AM IST
అప్సరసలు అసూయపడే అందమే హన్సిక: (బర్త్ డే స్పెషల్)
X
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో హన్సిక ఒకరు. 'దేశముదురు' సినిమాతో ఈ అమ్మాయి టాలీవుడ్ కి పరిచయమైంది. తెరపై ఈ పిల్లను చూసిన వాళ్లంతా ఎవరీ పింక్ డైమండ్ అనుకున్నారు. దారితప్పి వచ్చిన దేవకన్యనా? అనుకుని ఆశ్చర్యపోయారు. పాలరాతి శిల్పాన్ని కేరట్ జ్యూస్ తో అభిషేకించినట్టు .. మల్లెల్లో గులాబీలు కలిపి గుమ్మరించినట్టుగా ఉన్న ఆమె కలర్ చూసి కళ్లను కలలకు అప్పగించేశారు. ఆమె స్కిన్ టోన్ చూసి కోలుకోవడానికే చాలా సమయమే తీసుకున్నారు.

అంతకుముందు కూడా ఇక్కడికి చాలామంది అందమైన కథానాయికలు వచ్చారు. కానీ హన్సిక అందం ప్రత్యేకం . ఆమె రూపం అపురూపం. అలాంటి హన్సిక తొలి సినిమాతోనే భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇక గుమ్మడి పువ్వులాంటి ఈ గుమ్మ జోరు కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ 'కందిరీగ' వరకూ తేనెపట్టులాంటి ఈ పిల్లకు హిట్ పడలేదు. పోనీ ఈ సినిమా తరువాతైనా ఆమె హవా కొనసాగిందా అంటే అదీ లేదు .. మళ్లీ కథ మామూలే.

ఇలా గ్యాప్ వస్తుండటంతో కుర్రాళ్లంతా జ్వరాలు తెచ్చేసుకోవడం మొదలుపెట్టారు.

అప్సరసలు అసూయపడే అందం .. అప్సరసలకు తెలియని అభినయం హన్సిక సొంతం. అయినా ఈ పిల్ల ఎందుకు గ్యాప్ ఇస్తూ వెళ్లిందంటే, తమిళంలో బిజీగా ఉండటమే అందుకు కారణం. తెలుగులో కన్నా అక్కడ ఎక్కువ ఆదరణ లభించడం వల్లనే అక్కడ వరుస సినిమాలను ఒప్పేసుకుంటూ వెళ్లింది. తెలుగు పిలగాళ్లు ఈ అమ్మాయిని చూసి దేవతలా ఉందనుకుని ఆరాధించారు. తమిళ కుర్రాళ్లు మాత్రం 'దేవతలా ఉండటమేంటి? .. దేవతనే' అని చెప్పేసి గుడి కట్టేసి పూజలు చేయడం కూడా మొదలుపెట్టేశారు.

దాంతో ఈ పాలబుగ్గల పిల్ల తన 'గుడి' తమిళనాడులో ఉంటే తాను వేరే చోటుకు వెళ్లడం ఎందుకని అక్కడి సినిమాలు చేసుకుంటూ కూర్చుంది. అయితే గ్లామర్ తో పాటు అక్కడ అవకాశాలు కూడా తగ్గడంతో, మళ్లీ తెలుగు సినిమాలు చేయడానికి హన్సిక ఉత్సాహాన్ని చూపుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఆ మధ్య చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' సినిమా బాగానే ఆడింది. ప్రస్తుతం ఆమె చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఆమె కెరియర్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతాయో చూడాలి. ఈ రోజున తన బర్త్ డే .. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెప్పేద్దాం.