Begin typing your search above and press return to search.

నిలబడి గెలిచిన హీరో నితిన్

By:  Tupaki Desk   |   30 March 2021 4:30 AM GMT
నిలబడి గెలిచిన హీరో నితిన్
X
కొంచెం హ్యాండ్సమ్ గా ఉంటే చాలు .. ఇంకాస్త డబ్బుంటే చాలు .. ఎవరైనా హీరో కావొచ్చునని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి ఒక ఫ్యామిలీ ఒక హీరోను ఎప్పటికీ నిలబెట్టలేదు. ఎందుకంటే థియేటర్ కి రావలసింది ప్రేక్షకులే .. హీరోలకి కావలసింది వాళ్ల ఆమోదముద్రనే. హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పుడే అతగాడు ఏ విషయంలో వీక్ గా ఉన్నా ఆడియన్స్ పసిగట్టేస్తారు. లాభం లేదురా అబ్బాయ్ అని చెప్పేసి సింపుల్ గా ఒక సర్టిఫికెట్ ఇచ్చేసి ఇంటికి పంపించేస్తారు. హిట్టు .. ఫ్లాపు సంగతి తరువాత, ఒక హీరో కోసం జనం థియేటర్ కి వచ్చారంటే, అతణ్ణి హీరోగా వాళ్లు అంగీకరించినట్టే లెక్క.

అలా నితిన్ చాలా చిన్నవయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సెంటిమెంట్ అనుకున్నా .. కథకి సెట్ అయిందనుకున్నా 'జయం' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలి సినిమానే ప్రేమకథ కావడం .. కుర్రాడు కాస్త కుదురుగా ఉండటంతో ఆ సినిమా ఒక రేంజ్ లో ఆడేసింది. ఈ సినిమాలో నితిన్ కాస్త బొద్దుగా .. కొత్తదనంతో కూడిన అమాయకత్వంతోనే కనిపిస్తాడు. ఆ తరువాత నితిన్ చేసిన 'దిల్' .. 'సై' సినిమాలు ఆయనకు భారీ విజయాలను అప్పగించాయి. కుర్రాడు ప్రేమకథా చిత్రాలకు మాత్రమే పనికొస్తాడని భావించిన కొంతమందికి, నితిన్ 'సై' సినిమాతో సరైన సమాధానం చెప్పాడు. యాక్షన్ .. ఎమోషన్ పరంగా కూడా శభాష్ అనిపించుకున్నాడు.

చాలా తక్కువ సమయంలోనే నితిన్ కి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అమ్మాయిల్లో కూడా నితిన్ కి మంచి ఫాలోయింగ్ ఉండేది. అలాంటి సమయంలోనే నితిన్ ను దురదృష్టం వెంటాడింది. దాదాపు ఏడేళ్లపాటు వరుసగా 11 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీగా దెబ్బతిన్నాయి. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఒక హీరోకి తనపై తనకిగల నమ్మకాన్ని దెబ్బతీసే స్థితి. ఇంతలా ఫ్లాపులు వచ్చి మీదపడుతుంటే ఏ హీరో అయినా ఇంటిదారి పట్టాల్సిందే. అయినా నితిన్ తట్టుకుని నిలబడ్డాడు .. నిలబడి కలబడ్డాడు .. కలబడి గెలిచాడు .. గండాలను దాటేసి జెండా ఎగరేశాడు.

ప్రేమకథా చిత్రంతోనే నితిన్ కెరియర్ మొదలైంది .. వరుస పరాజయాల తరువాత ఆయనకి హిట్టు ఇచ్చింది కూడా ప్రేమకథనే .. అదే 'ఇష్క్'. అంతకుమించి అన్నట్టుగా ఆ తరువాత 'గుండెజారి గల్లంతయ్యిందే'తో మరో హిట్టు కొట్టాడు. ఈ సినిమాతో నితిన్ యూత్ లో మళ్లీ ఓ కదలిక తీసుకొచ్చాడు. చాలా ఏళ్ల క్రింద తప్పిపోయిన తన క్రేజ్ ను వెతికి మోసుకొచ్చాడు. ఆ తరువాత కూడా అప్పుడప్పుడు ఫ్లాపులు పలకరించినా అవి ఆయన కెరియర్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. క్రితం ఏడాది 'భీష్మ'తో విజయాన్ని అందుకున్న ఆయన, ఈ ఏడాది 'రంగ్ దే'తోను సక్సెస్ సాధించాడు. ఈ రోజు బర్త్ డే వేడుక జరుపుకుంటున్న నితిన్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని విజయాలను ఆయన అందుకోవాలని ఆశిద్దాం!