Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ గా హనుమ కథ .. హీరో ఎవరనేది సస్పెన్స్!

By:  Tupaki Desk   |   18 July 2021 6:42 AM GMT
వెబ్ సిరీస్ గా హనుమ కథ .. హీరో ఎవరనేది సస్పెన్స్!
X
నిన్నమొన్నటి వరకూ ఒకటి రెండు వెబ్ సిరీస్ ల పేర్లే వినిపించేవి. స్టార్ ప్రొడ్యూసర్లు .. డైరెక్టర్లు .. హీరోలు .. హీరోయిన్లు ఆ దిశగా అడుగులు వేయడంతో, వెబ్ సిరీస్ ల రూపు రేఖలు మారిపోయాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా వెబ్ సిరీస్ ల గురించే మాట్లాడుకుంటున్నారు. చాలా వెబ్ సిరీస్ లు వెయిటింగులో ఉండగా, అంతకన్నా ఎక్కువ సెట్స్ పై ఉండటం విశేషం. యూత్ ఎక్కువగా వెబ్ సిరీస్ ల వైపు మొగ్గుచూపుతోంది. దాంతో సాద్యమైనంత వరకూ సినిమా క్వాలిటీతోనే వెబ్ సిరీస్ లు రూపొందుతున్నాయి. కొత్త ప్రయోగాలతో వాళ్లని మరింతగా ఆకట్టుకుంటున్నాయి.


ఇక పౌరాణికాలు కూడా వెబ్ సిరీస్ లు గా పకరించనున్నాయి. ఆ దిశగా కొంతమంది ఇప్పటికే తమ ప్రయత్నాలను ప్రారంభించారు. అలాంటి ప్ర్రయత్నంలోనే తాను కూడా ఉన్నానని ప్రముఖ సినిమాటో గ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను ఇండస్త్రీకి వచ్చి 50 ఏళ్లు దాటిపోయింది. నేను పూర్ స్టూడెంట్ గా ఉండేవాడిని. అప్పట్లో నాన్న సినిమా ఫీల్డ్ లోనే ఉండేవారు. ఆయనకి చాలామందితో మంచి పరిచయాలు ఉండేవి. సి. నాగేశ్వరరావు అనే కెమెరామెన్ దగ్గర నన్ను పెట్టారు. అలా ఇండస్ట్రీలో నా కెరియర్ మొదలైంది.


ఒకసారి కెమెరామెన్ స్వామిగారు నాకు తారసపడి నాతో మాట్లాడారు. మా నాన్నగారి పట్ల గల కృతజ్ఞతా భావంతో నన్ను అసిస్టెంట్ గా తీసుకున్నారు. అలా అసిస్టెంట్ కెమెరామెన్ గా నేను కృష్ణగారి సినిమా 'అగ్నిపరీక్ష' కు పనిచేశాను. అక్కడి నుంచి ఇక వరుస సినిమాలకు పనిచేస్తూ వెళ్లాను. స్వామిగారు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. నిజమైన గురువు అనే మాటకి ఆయనే నిదర్శనం. ఆయన దగ్గర నుంచి నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. సినిమాటోగ్రఫర్ గా నా తొలి సినిమా 'సంసార బంధం'. అక్కడి నుంచి ఇక ఆ దార్లోనే నా ప్రయాణం సాగుతూ వచ్చింది.


కరోనా కారణంగా కొంతకాలం నుంచి మాత్రం ఇంటిపట్టునే ఉన్నాను. ఈ సమయంలో వెబ్ సిరీస్ కోసమని రెండు సబ్జెక్టులు రెడీ చేసుకున్నాను. వాటిలో ఒకటి ఆంజనేయస్వామిపై ఉంటుంది. హనుమంతుడి జీవిత చరిత్రను రెండు సీజన్లుగా చెప్పాలని అనుకుంటున్నాను. హనుమంతుడి జీవితానికి సంబంధించి ఇంతవరకూ ఎవరూ చెప్పని విషయాల నుంచి ఈ వెబ్ సిరీస్ మొదలవుతుంది. రాముడు నిర్యాణం చెందిన తరువాత లవకుశులు రాజ్యం ఏలారు. అప్పుడు హనుమంతుడి పాత్ర ఏమిటనేది చూపించాలని అనుకుంటున్నాను. తప్పకుండా ఇది కొత్తగా ఉంటుందని నేను భావిస్తున్నాను.


నిజానికి లవకుశుల పరిపాలన ఎలా ఉండేది? ఆ కాలంలో హనుమంతుడు ఏం చేశాడు? అనే విషయాలు చాలామందికి తెలియదు. ఇంతవరకూ ఆ వైపు నుంచి ఎవరూ చూపించే ప్రయత్నం కూడా చేయలేదు. కొత్తగా .. మరింత ఇంట్రెస్టింగా ఉండాలనే ఉద్దేశంతో కథను అక్కడి నుంచి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకూ ఎవరూ చెప్పని విషయం కావడంతో, మంచి ప్రయత్నం అవుతుందనే అనుకుంటున్నాను. భారీ ఖర్చుతోనే ఈ వెబ్ సిరీస్ నిర్మితమవుతుంది. ఇపుడున్న నటుల్లో హనుమంతుడి పాత్రకు ఎవరు సరిగ్గా సరిపోతానేది నా మనసులో ఉంది .. సమయం వచ్చినప్పుడు చెబుతాను" అని అన్నారు.