Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసులో వాళ్లిద్దరూ ఉన్నారా?

By:  Tupaki Desk   |   20 Oct 2016 10:30 PM GMT
సంక్రాంతి రేసులో వాళ్లిద్దరూ ఉన్నారా?
X
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలు ఎవరంటే చిరంజీవి-బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ పేర్లే వినిపించేవి. దాదాపు రెండు దశాబ్దాల పాటు ప్రధానంగా వీరి చుట్టే తెలుగు సినిమా తిరిగింది. వీరిలో ఏ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు జరిగినా ఆ కిక్కే వేరుగా ఉండేది. ఐతే ఆ తర్వాత పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. జూనియర్ ఎన్టీఆర్ లాంటి యువ కథానాయకులు వచ్చారు. వారి మధ్యే ప్రధానంగా పోరు నడుస్తోంది. ఐతే వచ్చే సంక్రాంతికి మాత్రం మళ్లీ ఒకప్పటి తరహాలో మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ సమరానికి సై అంటుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. చిరు సినిమా ‘ఖైదీ నెంబర్ 150’.. బాలయ్య మూవీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతికి కన్ఫమ్ అయ్యాయి.

ఐతే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అక్కినేని నాగార్జున.. విక్టరీ వెంకటేష్ సైతం సంక్రాంతి మీద దృష్టిసారించారట. వాళ్ల సినిమాలకు సంక్రాంతికి పక్కా అని చెప్పలేం కానీ.. కుదిరితే అప్పటికి రిలీజ్ చేయడానికి మాత్రం చూస్తున్నట్లు తెలుస్తోంది. నాగార్జున సినిమా ‘ఓం నమో వెంకటేశాయ’ ముందు అనుకున్నది సంక్రాంతికే. కానీ తర్వాత వెనక్కి తగ్గినట్లు కనిపించారు. ఐతే తాజాగా ‘ప్రేమమ్’ సక్సెస్ మీట్ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. అన్నీ కుదిరితే ‘ఓం నమో వెంకటేశాయ’ను సంక్రాంతికి తీసుకొస్తామన్నాడు. షూటింగ్ కొంచెమే మిగిలి ఉందని.. ఐతే సీజీ వర్క్.. విజువల్ ఎఫెక్ట్స్ పనుల కోసం చాలా టైం పడుతోందని.. ముందే రిలీజ్ డేట్ ఇచ్చి.. ఆ తర్వాత ఆ పని పూర్తి కాకపోతే బాగోదని వెయిట్ చేస్తున్నామని.. అన్నీ కుదిరి సినిమా రెడీ అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తామని నాగ్ వెల్లడించాడు. మరోవైపు వెంకీ సినిమా ‘గురు’ రిలీజ్ డేట్ గురించి ఇప్పటిదాకా ప్రకటన ఏదీ రాలేదు కానీ.. ఆ సినిమా డిసెంబరు కల్లా పూర్తయిపోతుందట. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీపావళికే ఫస్ట్ టీజర్ కూడా రిలీజ్ చేసేస్తున్నారు. సినిమా అయితే సంక్రాంతి లోపు రెడీ అయిపోతుంది. ఐతే అప్పటి పరిస్థితిని బట్టి పండక్కి రిలీజ్ చేయాలా లేదా అని నిర్ణయిస్తారట. మరి ఈ ఇద్దరు సీనియర్లు కూడా సంక్రాంతి రేసులో నిలిచి.. రసవత్తర పోరుకు తెర తీస్తారేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/