Begin typing your search above and press return to search.

నిర్మాత‌ల గిల్డ్ వ‌ర్సెస్ నిర్మాత‌ల మండ‌లి

By:  Tupaki Desk   |   2 Sept 2019 1:24 PM IST
నిర్మాత‌ల గిల్డ్ వ‌ర్సెస్ నిర్మాత‌ల మండ‌లి
X
తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లిలో అస‌లేం జ‌రుగుతోంది? `నిర్మాత‌ల గిల్డ్` వ‌ర్సెస్ `నిర్మాత‌ల మండ‌లి` (టీఎఫ్ పీసీ) వార్ పీక్స్ కి చేరుతోందా? మ‌ండ‌లికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొత్త అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్.. ప్ర‌త్య‌ర్థి యాక్టివిటీస్ కి ఎదురెళుతున్నారా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. నిర్మాత‌ల గిల్డ్ వేరు కుంప‌టి వ్య‌వ‌హారంపై మొన్న ఎన్నిక‌ల సంద‌ర్భంగా మండ‌లి కొత్త‌ అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్ డైరెక్టుగానే హెచ్చ‌రించారు. అయితే తాము మునుముందు కొత్త నిర్ణ‌యాలు తీసుకుంటాం! అంటూ గిల్డ్ వాళ్లు ప్ర‌తి స‌వాళ్లు విసిరారు. ఆ త‌ర్వాత ఎవ‌రికి వారు స‌రికొత్త ఎత్తుగ‌డ‌ల‌తో ముందుకు వెళుతున్నార‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. అయితే ఈ నిర్మాత‌ల వార్ లో అస‌లేం జ‌రుగుతోంది.. ఎవ‌రిది పై చేయి కాబోతోంది? అన్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్.

చిన్న నిర్మాత‌ల‌కు అండ‌గా నిలిచేందుకు మండ‌లి అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్ ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌ట‌. గిల్డ్ నిర్మాత‌లు వేస్తున్న ప్ర‌తి అడుగును వ్య‌తిరేకిస్తూ సి.క‌ళ్యాణ్ ముందుకు వెళుతున్నార‌ని తెలుస్తోంది. పైకి అంద‌రూ భుజాలు రాసుకుంటూ తిరిగేస్తున్నా.. అంత‌ర్గ‌తంగా చాలా అండ‌ర్ క‌రెంట్ మ్యాట‌ర్స్ ర‌న్ అవుతున్నాయ‌ని రివీలైంది. ఆర్థికంగా ఎంతో బ‌లంగా ఉండాల్సిన టీఎఫ్ పీసీ గిల్డ్ స‌ప‌రేట్ కుంపటి వ‌ల్ల బ‌ల‌హీన‌ప‌డింద‌న్న‌ది స‌భ్యుల ఆవేద‌న‌. అందుకే టీఎఫ్ పీసీ బ‌లం పెంచేందుకు ప్ర‌స్తుతం కొత్త అధ్య‌క్షుడు చ‌ర్య‌లు చేప‌డుతున్నారని తెలుస్తోంది.

తెలుగు సినిమా నిర్మాత‌ల మండ‌లి అధ్య‌క్షుడిగా గెలిచాక సి.క‌ళ్యాణ్ తీసుకున్న తాజా నిర్ణ‌యం గిల్డ్ నిర్మాత‌ల‌కు ప్ర‌తికూలంగా ఉంద‌ని కొంద‌రు నిర్మాత‌లు విశ్లేషిస్తున్నారు. ఇంత‌కీ సి.క‌ళ్యాణ్ తీసుకున్న ఆ నిర్ణ‌యం ఏమిటి? అంటే.. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల డీల్ విష‌య‌మై ఇరువ‌ర్గాల‌(నిర్మాత‌లు- చానెళ్ల‌)కు సానుకూలంగా ఉండేలా టాప్ 3 తెలుగు వార్తా చానెళ్ల‌తో ఓ ఒప్పందం కుదుర్చుకున్నార‌ని తెలుస్తోంది. స‌ద‌రు మూడు చానెళ్ల‌తో పాటుగా మ‌రో ఏడు ఫ్రీ టీవీ చానెళ్లు ఈ డీల్ లో భాగ‌స్వాములుగా చేరాయని తెలుస్తోంది. దీనివ‌ల్ల నిర్మాత‌ల‌కు 30-40శాతం మేర ప్ర‌క‌టన‌ల ఖ‌ర్చు త‌గ్గ‌నుంది. అలాగే స్థిరంగా చిన్న సినిమాల నుంచి టీవీ చానెళ్ల‌కు రాబ‌డి పెర‌గ‌నుంది. దాదాపు 1200 పైగా స‌భ్యులున్న నిర్మాత‌ల మండ‌లి నుంచి భారీ మొత్తంలో ప్ర‌క‌ట‌న‌లు స‌ద‌రు చానెళ్ల‌కు వెళ్లే ఆస్కారం ఉంది. అలాగే ఇక‌పై డిజిట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్లు (డీఎస్ పీ) ధ‌ర‌ల విష‌యంలో త‌గ్గేలా ఒత్తిడి తేనున్నార‌ట‌. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు.. డిజిట‌ల్ స‌ర్వీస్ వ‌ర‌కే ప‌రిమితం కాదు.. చిన్న నిర్మాత‌ల స‌మ‌స్య‌లెన్నిటినో ప‌రిష్క‌రించాల‌ని కొత్త అధ్య‌క్షుడు ప్లాన్ చేస్తున్నార‌ట‌.