Begin typing your search above and press return to search.

జీఎస్‌ టి అమలు అంత ఈజీ కాదు

By:  Tupaki Desk   |   4 Aug 2016 9:43 AM GMT
జీఎస్‌ టి అమలు అంత ఈజీ కాదు
X
వస్తు సేవల పన్ను (జిఎస్‌ టి) బిల్లు ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదం పొందడంతో బీజేపీ మొఖం వెలిగిపోతోంది. కానీ... ఇది అమలు చేయడం మాత్రం వారనుకున్నంత సులువు కాదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. పార్లమెంట్‌ ఆమోదం లభించిన నేపథ్యంలో మిగతా తంతును వేగంగా పూర్తి చేసి జిఎస్‌టిని అమలులోకి తేవాలని కేంద్ర యోచిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఆశ ఇప్పట్లో నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు. ఏప్రిల్ నుంచి అమలు చేస్తామని కేంద్రం చెబుతున్నా దీనికి చాలా సమయం పడుతుందని అంటున్నారు.

ముఖ్యంగా జీఎస్‌ టీ అమలునకు తగ్గ మౌలిక వసతులు - నిపుణులైన ఉద్యోగులు - టెక్నాలజీ అందుబాటులో లేదు. జీఎస్‌ టీ అమలుకు గాను దేశంలోని అన్ని కంపెనీలు - సప్లయర్లు - వెండర్లు - రిటైలర్లు - డీలర్లతో పాటు గుమస్తాలు - వినోద కేంద్రాలు - రెస్టారెంట్లు కంప్యూటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. వీటి ద్వారా కేంద్రీకృత జీఎస్‌ టీ నెట్‌ వర్క్‌ ను తన కంప్యూటర్ల ద్వారా లాగిన్ అయి పన్ను వ్యవహారాలను నిర్వహించాల్సి ఉంటుంది. జీఎస్‌ టీ బిల్లుకు చట్ట రూపం దాల్చినా ఈ సరికొత్త పన్ను వ్యవస్థ పూర్తి అమలులోకి వచ్చేందుకు మరో ఏడాదిన్నర కాలానికి పైగానే పట్టే అవకాశాలున్నట్లు సమాచారం.

నగరాలలోనూ - పట్టణాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కంపెనీలు సులువుగా జీఎస్‌ టీకి మారేందుకు అవకాశం ఉంది. చిన్న పట్టణాలతో పాటు మారుమూల గ్రామాలలో ఈ వ్యవస్థ ఏర్పాటు కొంత కష్టమైన పనే. పెద్ద కంపెనీలు ఆర్థికంగా బలంగా ఉంటాయి కావున ఇవి వేగంగా కొత్త పన్ను విధానాన్ని అంది పుచ్చుకొనే అవకాశం ఉంది. టైర్లు - ఆటోమొబైల్‌ - ఐటీ - ఎఫ్‌ ఎండీబీ కంపెనీలు ఇప్పటకే తమ సప్లై చెన్‌ లో పన్నుల చెల్లింపులకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని ఉన్నాయి. ఆయా సంస్థలు ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ఇఆర్‌ పీ ప్యాకేజీల్లో మార్పులు చేసుకొంటే సరిపోతుంది. చిన్న కంపెనీలు - రిటైలర్లకు ఇది ఆర్థిక భారంగా మారనుంది. ఏప్రిల్‌ నుంచి జీఎస్‌ టీ బిల్లును అములులోకి తేవాలని గడువు నిర్ధేశించుకున్న సర్కారు ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది. పార్లమెంట్‌ ఆమోదం లభించినా దేశంలోని 29 రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు బిల్లుకు సమ్మతి తెలపాల్సివుంది. అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి వెళ్తుంది. జిఎస్‌ టి అమలు చేసేందుకు ప్రత్యేకంగా కౌన్సిల్‌ ను ఏర్పాటు చేయాల్సివుంటుంది. పన్నురేటు - మినహాయింపులు - గరిష్ట పరిమితి తదితర కీలక విషయాల అంశమై జీఎస్‌ టీ ఎంపవర్డ్‌ కమిటీ ఏకాభిప్రాయాన్ని సాధించాల్సి ఉంటుంది.

దీనికి తోడు వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌ - పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. జీఎస్‌ టి అమల్జేస్తే మొదట్లో కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలుంటాయి కాబట్టి వ్యాపారవర్గాలు - పరిశ్రమల్లో వ్యతిరేకత వచ్చే అవకాశాలూ ఉంటాయి. కాబట్టి ఎన్నికల నేపథ్యంలో సర్కారు జీఎస్‌ టీ అమలను సాహసించకపోవచ్చు. ఈ ఎన్నికలు ముగిశాకే 2017 ద్వితీయార్థంలో అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.