Begin typing your search above and press return to search.

బ్యాగ్రౌండ్ లేదు.. కానీ ఈ జోరేంటి?

By:  Tupaki Desk   |   15 July 2021 11:05 AM GMT
బ్యాగ్రౌండ్ లేదు.. కానీ ఈ జోరేంటి?
X
సినీ పరిశ్రమలో బ్యాగ్రౌండ్ లేకుండా ఎదగడం, ఫాలోయింగ్, మార్కెట్ తెచ్చుకోవడం అంత తేలిక కాదు. పేరున్న సినీ కుటుంబంలోకి కనీసం అల్లుడిగా అయినా ఎంట్రీ ఇస్తే తప్ప సినీ రంగంలోకి ప్రవేశం తేలిగ్గా జరగదు. ఇండస్ట్రీలోకి రావడం ఒకెత్తయితే తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకులను మెప్పించడం, మంచి అవకాశాలు అందుకోవడం మరో ఎత్తు. ఐతే చాలా కొద్ది మంది మాత్రమే బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి గుర్తింపు సంపాదిస్తారు.

అవకాశాలు పెంచుకుంటారు. ఈ తరంలో విజయ్ దేవరకొండ అందుకు పెద్ద ఉదాహరణ. నిఖిల్, విశ్వక్సేన్ లాంటి వాళ్లు కూడా సొంతంగా కష్టపడి ఎదిగి ఒక స్థాయిని అందుకున్నారు. ఇప్పుడిక కిరణ్ అబ్బవరం అనే కొత్త కుర్రాడు ఏ బ్యాగ్రౌండ్ లేకుండానే టాలీవుడ్లో తనదైన ముద్ర వేయడానికి చూస్తున్నాడు. అతను 'రాజావారు రాణి వారు' అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే.

మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్న 'రాజా వారు రాణివారు' థియేటర్లలో కంటే అమేజాన్ ప్రైమ్‌లో బాగా ఆడింది. ఆ గుర్తింపుతో కిరణ్‌కు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అతడి రెండో సినిమా 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' యూత్‌లో మంచి క్రేజే తెచ్చుకుంది. ఈ చిత్రానికి కిరణ్ స్వయంగా కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. దీని టీజర్, ఇతర ప్రోమోలు ప్రామిసింగ్‌గా అనిపించాయి. మంచి ఎంటర్టైనర్ లాగా కనిపించింది.

వెంకటేష్ లాంటి పెద్ద హీరో సినిమా 'నారప్ప' ఓటీటీ విడుదలకు సిద్ధమవుతుంటే.. ఓటీటీల నుంచి ఆఫర్లు వచ్చినా కూడా కాదనుకుని ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయడానికి సిద్ధమైంది చిత్ర బృందం. ఆగస్టు 6న థియేటర్లలోకి దిగబోతోందీ సినిమా. ఇదిలా ఉంటే.. చాందిని చౌదరికి జోడీగా కిరణ్ 'సమ్మతమే' అనే మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఇది కాక 'సెబాస్టియన్' అంటూ ఒక పోలీస్ స్టోరీలోనూ నటిస్తున్నాడు.

దాని టీజర్ ఆకట్టుకుంది. తాజాగా కోడి రామకృష్ణ తనయురాలు దివ్య దీప్తి నిర్మాణంలో కిరణ్ హీరోగా కార్తీక్ శంకర్ కొత్త దర్శకుడు రూపొందించనున్న సినిమాను కూడా అనౌన్స్ చేశారు. ఒక్క సినిమా అనుభవంతో ఓ కొత్త కుర్రాడు ఇలా నాలుగు సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడం, వాటితో ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించడం విశేషమే.