Begin typing your search above and press return to search.

టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పెరుగుతున్న పోటీ!

By:  Tupaki Desk   |   12 March 2021 2:30 AM GMT
టాలీవుడ్లో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పెరుగుతున్న పోటీ!
X
మొదటి నుంచి కూడా టాలీవుడ్లో సంగీత దర్శకుల సంఖ్య పరిమితంగానే ఉంటూ వచ్చింది. ఒకానొక దశలో ఇళయరాజా .. చక్రవర్తి చేతుల మీదుగా ఎక్కువ సినిమాలు నడిచాయి. ఆ తరువాత రాజ్ - కోటి తమ జోరు చూపుతూ వచ్చారు. ఇక చాలాకాలంగా తెలుగులో దేవిశ్రీ ప్రసాద్ తన దూకుడు చూపుతూ వస్తున్నాడు. ఆయన ట్యూన్ల కోసం పెద్ద పెద్ద బ్యానర్లు కూడా వెయిట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటు యూత్ పల్స్ .. అటు మాస్ పల్స్ పట్టేసి దేవిశ్రీ చెలరేగిపోతున్న సమయంలోనే తమన్ ఎంట్రీ ఇచ్చాడు.

దేవిశ్రీ ప్రసాద్ ఫుల్ బిజీ కావడంతో తమన్ వైపుకు కొన్ని అవకాశాలు వెళ్లాయి. తమన్ తన కెరియర్ ను మొదలు పెట్టినప్పుడు ఆయన ఈ స్థాయికి చేరుకుంటాడని ఎవరూ ఊహించలేదు. ఆరంభం నుంచే కొత్తదనాన్ని చూపుతూ తమన్ స్పీడ్ పెంచేశాడు. ఆయన బాణీలు చేసిన గారడీకి యూత్ ఫిదా అయింది. స్టార్ హీరోలు సైతం ఆయనతో ట్యూన్లు చేయించుకోవడానికి ఉత్సాహాన్ని చూపుతూ వెళ్లారు. ఈ ఇద్దరి బాణీల ధాటికి ఒక అడుగు వెనక్కి తగ్గినట్టుగా కనిపించిన మణిశర్మ, తిరిగి తన సత్తా చూపించడం మొదలుపెట్టారు. ఇక ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను అనూప్ రూబెన్స్ .. మిక్కీ జె.మేయర్ చేస్తూ వస్తున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో సంగీత దర్శకుల మధ్య గట్టి పోటీ ఏర్పడిందనే విషయం అర్థమవుతోంది. పెద్ద బ్యానర్లలోని సినిమాలకు దేవిశ్రీ .. తమన్ .. మణిశర్మ పేర్లు వినిపిస్తుంటే, చిన్న సినిమాల కారణంగా చాలామంది సంగీత దర్శకులు బిజీ అవుతున్నారు. వీళ్లలో కొంతమంది కొత్తవాళ్లయితే .. మరికొంతమంది దార్లోపడుతున్నవాళ్లు. ఈ జాబితాలో రధన్ .. జేక్స్ బిజోయ్ .. అచ్చు రాజమణి .. రోషన్ సాలూరు .. కాలభైరవ .. శ్రీచరణ్ పాకాల .. సాయికార్తీక్ .. సురేశ్ బొబ్బిలి .. అరుణ్ చిలువేరు పేర్లు కనిపిస్తున్నాయి. ఇక పాన్ ఇండియా సినిమాలకి అమిత్ త్రివేది .. జస్టిన్ ప్రభాకరన్ వంటి పేర్లు తెరపై మెరుస్తున్నాయి. చూస్తుంటే టాలీవుడ్లో ఇంతకుముందెప్పుడూ లేని విధంగా మ్యూజిక్ డైరెక్టర్ల జోరు .. వాళ్ల మధ్య పోటీ పెరిగిందనే అనిపిస్తోంది.