ఊరికే మాట వరసకు అన్నాడో లేదా సీరియస్ గానే ఫిక్సయ్యాడో కానీ.. తమిళ స్టైలిష్, స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ మన నితిన్ తో తన దర్శకత్వంలో సినిమా తీస్తానంటున్నాడు. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న నితిన్ సినిమా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’కి గౌతమే నిర్మాత అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్లో గౌతమ్ మాట్లాడుతూ.. ‘‘నితిన్ తో కొరియర్ బాయ్ కళ్యాణ్ నిర్మాతగా లాంగ్ జర్నీ చేశా. అతడితో పని చేయడం మంచి అనుభవం. లవ్ స్టోరీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. నితిన్ త్రివిక్రమ్ తో చేస్తున్న ‘అ.. ఆ’ తర్వాత నా దర్శకత్వంలో అతను హీరోగా మంచి యాక్షన్ లవ్ స్టోరీ చేస్తాను. దానికి సంబంధించి వర్క్ ఇప్పటికే మొదలైంది. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తా’’ అని చెప్పాడు.
ఐతే తమిళ దర్శకులు, హీరోలు తమ సినిమాల ప్రమోషన్ కోసం వచ్చినపుడు తెలుగులో సినిమా చేస్తానని అనడం ఫ్యాషనైపోయింది. గౌతమ్ కూడా ఆ టైపేనా అని కొంచెం సందేహం కలుగుతోంది కానీ.. నితిన్ పక్కనుండగా ఈ మాట అన్నాడు కాబట్టి ఇందులో వాస్తవం ఉండే అవకాశముంది. ఇక కొరియర్ బాయ్ కళ్యాణ్ గురించి నితిన్ మాట్లాడుతూ.. ‘‘ఈ కథలో దమ్ముంది కాబట్టే మొదలైన మూడేళ్ల తర్వాత రిలీజవుతున్నా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఇది చాలా కొత్త కథ. ఈ సినిమా హిట్టయితే ఇలాంటి విభిన్నమైన సినిమాలు మరిన్ని వస్తాయి. ఓ అభిమాని ‘సీబీకే’ అంటే కంటెంట్ బేస్డ్ కథ అని అబ్రివేషన్ చెప్పాడు. నిజంగా ఇది కంటెంట్ బేస్డ్ మూవీనే. ఇమేజ్ పక్కనబెట్టి, కంటెంట్ ని నమ్మి ఈ సినిమా చేశా. సిస్టర్ సెంటిమెంటుతో లాస్ట్ ఫ్రేమ్ దాకా చాలా గ్రిప్పింగ్ గా ఉంటుందీ సినిమా’’ అన్నాడు.