Begin typing your search above and press return to search.

వెండితెర మాల్యా వస్తున్నాడు

By:  Tupaki Desk   |   30 May 2018 8:00 AM GMT
వెండితెర మాల్యా వస్తున్నాడు
X
కొన్నేళ్లుగా ఇండియన్ సినిమాలో బయోపిక్ ల హవా నడుస్తోంది. క్రీడాకారులు.. సినీ తారల జీవితాల్ని అద్భుత రీతిలో వెండితెరపైకి తీసుకొస్తున్నారు. ఇటీవలే తెలుగులో సావిత్రి కథతో ‘మహానటి’ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. దీనికి మంచి ఫలితం వచ్చింది. ఈ ఊపులో తెలుగులో మరిన్ని బయోపిక్ లకు సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీలో త్వరలోనే సంజయ్ దత్ సినమా ‘సంజు’ రాబోతోంది. బయోపిక్ తీయాలంటే గొప్ప వ్యక్తులే కావాల్సిన పని లేదని.. చెడు కోణం ఉన్న వాళ్ల జీవితాల్ని కూడా ఆసక్తికరంగా తెరపై చూపించవచ్చని ఈ చిత్రం రుజువు చేసేలా ఉంది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహమో ఏమో.. ఇప్పుడు ఘరానా మోసగాడు విజయ్ మాల్యా కథకు కూడా వెండితెర రూపం ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతుండటం విశేషం.

సెన్సార్ బోర్డు మాజీ ఛైర్మన్ ప్రహ్లాద్ నిహ్లాని.. మాల్యా కథతో స్వీయ దర్శకత్వంలో సినిమా నిర్మిస్తుండటం విశేషం. ఈ చిత్రంలో మాల్యా పాత్రను సీనియర్ నటుడు గోవిందా చేస్తున్నాడు. అతను మాల్యా లుక్ లో ఉన్న ఫొటో కూడా బయటికి వచ్చేసింది. మాల్యా చివరగా ఇండియాలో ఉన్న రోజుల్లో ఫ్రెంచ్ గడ్డంతో కనిపించేవాడు. అంతకంటే ముందు అతను పొడవాటి మీసంతో తెల్లటి జుట్టుతో స్టైలిష్ గా ఉండేవాడు. ఆ లుక్ లోనే గోవిందా కనిపిస్తున్నాడు. మాల్యా పాత్ర కోసం అతను బరువు కూడా పెరిగినట్లున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలైనట్లు సమాచారం. ఇటీవలే ‘కింగ్ ఫిషర్’ క్యాలెండర్ గర్ల్స్ తో కలిసి మాల్యా చిందులేస్తున్నట్లుగా ఒక పాటను చిత్రీకరించారట. మద్యం వ్యాపారంతో వేల కోట్ల ఆర్జించి లిక్కర్ కింగ్ గా పేరు గాంచిన మాల్యా.. వివిధ బ్యాంకులకు 9 వేల కోట్లకు పైగా రుణాలు ఎగ్గొట్టి రెండేళ్ల కిందట లండన్ చెక్కేసిన సంగతి తెలిసిందే. మరి సినిమాలో మాల్య గురించి అన్నీ వాస్తవాలే చూపిస్తారా లేదా అన్నది చూడాలి.