Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే స్పెష‌ల్ః ప‌డిలేసిన కెర‌టం గౌత‌మి!

By:  Tupaki Desk   |   2 July 2021 11:03 AM GMT
బ‌ర్త్ డే స్పెష‌ల్ః ప‌డిలేసిన కెర‌టం గౌత‌మి!
X
సినీ ప‌రిశ్ర‌మ‌లో కావొచ్చు.. జీవితంలో కావొచ్చు.. ప‌డిపోతే మ‌ళ్లీ లేవ‌డం అనేది చాలా క‌ష్టం. దానికి ఎంతో మాన‌సిక స్థైర్యం కావాలి. స‌వాళ్ల‌ను స్వీక‌రించే స్వ‌భావం ఉండాలి. అప్పుడు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంది. ఇవి రెండూ పుష్క‌లంగా ఉన్న న‌టి గౌత‌మి. య‌థాలాప‌లంగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన హీరోయిన్ గౌత‌మి.. ఆ త‌ర్వాత దాన్నే కెరీర్ గా ఎంచుకుంది. ప‌లు ఇండ‌స్ట్రీల్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది. ఆ త‌ర్వాత జీవితంలో ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంది. కింద ప‌డినా.. తిరిగి లేచి నిల‌బ‌డింది. ఇవాళ యాక్ట్రెస్‌ గౌత‌మి బ‌ర్త్ డే. మ‌న తెలుగు రాష్ట్రంలోని విశాఖ‌లో జ‌న్మించిన గౌత‌మి.. ఆ త‌ర్వాత బెంగ‌ళూరుకు షిఫ్టై అక్క‌డే పెరిగింది. నేడు ఆమె 54వ‌ వ‌సంతంలోకి అడుగు పెడుతోంది. ఆమె పుట్టిన రోజు సంద‌ర్భంగా జీవిత విశేషాలు త‌ర‌చి చూద్దాం..

''తుమ్మెదా.. ఓ తుమ్మెదా ఎంత తుంట‌రోడే గోవిందుడు తుమ్మె..'' అంటూ శ్రీనివాస కల్యాణం చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన సందడి చేసిన గౌతమి.. ప్రతి ఒక్క‌రినీ ఆక‌ర్షించింది. 19 సంవ‌త్స‌రాల వ‌య‌సులో చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన గౌత‌మి.. 1987లో 'దయామయుడు' చిత్రంలో నటించింది. ఆ చిత్రం పెద్ద‌గా హెల్ప్ కాలేదు. కానీ.. ఆ త‌ర్వాత రాజేంద్ర ప్ర‌సాద్ హీరోగా వ‌చ్చిన 'గాంధీనగర్ రెండో వీధి' చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌత‌మి.. అనంత‌రం ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్లింది.

అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న హీరోయిన్ల‌కు భిన్నంగా.. మోడ్ర‌న్ గా క‌నిపించే గౌత‌మిని అంద‌రూ లైక్ చేసేవారు. ఆడియ‌న్స్ ఆమెను బాగా ఆద‌రించ‌డంతో.. నిర్మాత‌లు కూడా గౌత‌మికి ఫ‌స్ట్ ఛాయిస్ అన్న‌ట్టుగా ఉండేవారు. దీంతో.. అతి త‌క్కువ కాలంలోనే తెలుగు, త‌మిళ్ ఇండ‌స్ట్రీల్లో టాప్ స్టార్ గా ఎదిగింది. తెలుగులో శ్రీనివాస క‌ల్యాణంతోపాటు బ‌జార్ రౌడీ, భార్యాభ‌ర్త‌లు, ఆగ‌స్టు 15 రాత్రి, బామ్మ‌మాట బంగారుబాట‌, తోడలుళ్లు వంటి చిత్రాల్లో న‌టించింది.

అదే స‌మ‌యంలో త‌మిళ‌నాట‌.. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాసన్ వంటి హీరోల స‌ర‌స‌న వ‌రుస సినిమాలు చేయ‌డంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ త‌ర్వాత శాండ‌ల్ వుడ్‌, మోలీవుడ్, బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా చేశారు. సుదీర్ఘ కాలం హీరోయిన్ గా స‌త్తా చాటిన గౌత‌మి.. 1998లో సందీప్ భాటియాను పెళ్లి చేసుకుంది. అయితే.. వారి బంధం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. వారికి ఓ పాప జ‌న్మించిన త‌ర్వాత ఇద్ద‌రూ విడిపోయారు. అయిన‌ప్ప‌టికీ.. మొక్క‌వోని ధైర్యంతో బిడ్డ‌తో బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఈ స‌మ‌యంలోనే ఆమె జీవితంలో ఊహించ‌లేని ప‌రిణామం జరిగింది. పాప‌కు ఐదేళ్ల వ‌య‌సు వ‌చ్చిన‌ప్పుడు.. గౌత‌మీ క్యాన్స‌ర్ బారిన ప‌డ్డారు.

అయిన‌ప్ప‌టికీ.. ధైర్యంగా ఎదుర్కొంది గౌత‌మి. బిడ్డ‌ను చూసుకుంటేనే.. క్యాన్సర్ తో రాజీలేని పోరాటం చేసింది. చివ‌ర‌కు అద్వితీయ‌మైన విజ‌యం సాధించింది. క్యాన్స‌ర్ ను త‌రిమికొట్టింది. ఈ స‌మ‌యంలో ఆమెకు క‌మ‌ల్ హాస‌న్ అండ‌గా ఉన్నారు. దీంతో.. ఐదేళ్ల‌పాటు ఒంట‌రి జీవితం గ‌డిపిన గౌత‌మి.. 2004లో క‌మ‌ల్ హాస‌న్ జీవితంలోకి ప్ర‌వేశించారు. ఆ త‌ర్వాత కూడా సినీ రంగంతో త‌న అనుబంధాన్ని కొన‌సాగించింది. ప‌లు చిత్రాల‌కు క్యాస్టూమ్ డిజైన‌ర్ గా వ‌ర్క్ చేసింది. అదేస‌మ‌యంలో.. క్యాన్స‌ర్ రోగుల‌కు మోటివేట‌ర్ గా మారింది. అవకాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా సినిమాల్లో కూడా నటిస్తోంది.

పుష్క‌ర‌కాలం పైన్నే క‌మ‌ల్ తో స‌హ‌జీవ‌నం కొన‌సాగించిన గౌత‌మి.. ఈ మ‌ధ్య‌నే విడిపోయారు. శృతిహాస‌న్ కార‌ణంగానే క‌మ‌ల్‌-గౌత‌మి బంధానికి బ్రేక్ ప‌డింద‌నే ఆరోప‌ణ‌లు కూడా వ‌చ్చాయి. త‌నకూ కూతురు ఉంద‌ని, ఆమె జీవితాన్ని చక్క‌దిద్దాల్సిన బాధ్య‌త త‌న‌పైనే ఉంద‌ని చెప్పి విడిపోయారు గౌత‌మి. అప్ప‌టి నుంచి మ‌ళ్లీ ఒంట‌రిగానే జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. ఈ విధంగా జీవితంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్న గౌత‌మి.. ప‌డిన ప్ర‌తిసారీ కెర‌టంలా లేచి ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇవాళ పుట్టిన రోజు సంద‌ర్భంగా.. ఆమెకు 'తుపాకీ' తరపున శుభాకాంక్షలు.