Begin typing your search above and press return to search.

డైరెక్టర్ సార్.. డైరెక్షనే చేయండి

By:  Tupaki Desk   |   19 Sep 2015 5:30 PM GMT
డైరెక్టర్ సార్.. డైరెక్షనే చేయండి
X
డైరెక్టర్ లు నిర్మాతలుగా మారడం కొత్తేమీ కాదు. తమ అసిస్టెంట్ లకు అవకాశాలిచ్చి సినిమాలు నిర్మించే దర్శకులు చాలామందే ఉంటారు. తమిళంలో శంకర్ - మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్లు నిర్మాతలుగా మంచి విజయాలనందుకున్నారు. లో బడ్జెట్ లో మంచి మంచి సినిమాలు తీశారు. దీని వల్ల చాలామందికి అవకాశాలిచ్చారన్న పేరూ వచ్చింది. భారీగా లాభాలూ మూటగట్టుకున్నారు. ఐతే అందరు దర్శకులూ ఇలా నిర్మాతలుగా విజయవంతం అయిపోతారనేం లేదు.

గౌతమ్ మీనన్ నే తీసుకుంటే ఆయన నిర్మాతగా మారి సాధించిందేమీ లేదు. తాను డైరెక్ట్ చేసిన సినిమాల్లో పెట్టుబడులు పెట్టినపుడు ఇబ్బందేమీ రాలేదు కానీ.. వేరే వాళ్లకు అవకాశమిచ్చి చేతులు కాల్చుకున్నాడు. ఇంతకుముందు అంజనా అలీ ఖాన్ అనే లేడీ డైరెక్టరును పరిచయం చేస్తూ తీసిన ‘వెప్పం’ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆపై రామ్ అనే యువ దర్శకుడితో ‘తంగ మీన్గల్’ అనే సినిమా తీశాడు. దానికి అవార్డులైతే వచ్చాయి కానీ.. కమర్షియల్ గా ఫెయిల్యూర్ అయింది.

తాజాగా సీరియల్ నటుడు ప్రేమ్ సాయిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ తీశాడు. దీని నిర్మాణంలో గౌతమ్ ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. తీరా విడుదలయ్యాక ఈ సినిమా గౌతమ్ కు చేదు అనుభవం మిగిల్చింది. దీని తమిళ వెర్షన్ ఇంకో రెండు వారాల్లో విడుదల కాబోతోంది. తెలుగులో ఆడని సినిమా తమిళంలో మాత్రం ఏమాత్రం ప్రభావం చూపిస్తుందో అన్నది డౌటే. గౌతమ్ కు డైరెక్టర్ గా మంచి పేరుంది. మంచి అవకాశాలున్నాయి. చక్కగా ఆ పనే చేసుకుంటే బెటరేమో మరి.