Begin typing your search above and press return to search.

శింబు దెబ్బకు చైతన్య బెంబేలు

By:  Tupaki Desk   |   23 Sep 2015 3:30 PM GMT
శింబు దెబ్బకు చైతన్య బెంబేలు
X
కొందరి పేర్లంతే.. ఎప్పుడూ వివాదాలతో ముడిపడి ఉంటాయి. తమిళ హీరో శింబు కూడా ఆ టైపే. మనోడికి ఏదో ఒక కాంట్రవర్శీ లేనిదే నిద్ర పట్టదు. అతడి వాలు సినిమా రెండేళ్ల పాటు వాయిదాల మీద వాయిదాలు పడి.. ఎట్టకేలకు ఈ మధ్యే రిలీజైంది. శింబుకి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లతో ఉన్న గొడవలే దీనికి కారణం. శింబు నటించిన ఇంకో సినిమా ‘ఇదు నమ్మ ఆళు’ కూడా ఇబ్బందుల్లో ఉంది. ఆ సినిమా డైరెక్టర్ పాండిరాజ్ తో శింబుకి విభేదాలున్నాయి. వాటి సంగతి వదిలేస్తే స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో కూడా శింబు గొడవ పెట్టుకుంటుండటమే ఆశ్చర్యం కలిగిస్తోంది.

గౌతమ్ స్టేచర్ ఏంటో తెలిసిందే. అతను శింబుతో సినిమా చేయడమే ఎక్కువ. ఇంతకుముందు విన్నైతాండి వరువాయ (తెలుగులో ఏమాయ చేసావె)తో శింబును సక్సెస్ ట్రాక్ ఎక్కించిన ఘనత కూడా గౌతమ్ దే. అలాంటి వాడితో సినిమా అంటే బుద్ధిగా షూటింగుకి వచ్చి సినిమా పూర్తి చేయాలి కదా. కానీ అతను చేయట్లేదు. తన సినిమాల్ని ఒకేసారి తమిళం - తెలుగులో వేర్వేరు హీరోలతో షూట్ చేయడం గౌతమ్ కు అలవాటు. శింబు సినిమా విషయంలోనూ అలాగే చేస్తున్నాడు. ఈ మూవీని తెలుగులో నాగచైతన్యతో తీస్తున్నాడు. లొకేషన్లు - సన్నివేశాలు సేమ్ టు సేమ్. ఐతే షూటింగుకి అంతా రెడీగా ఉండగా.. శింబు హ్యాండ్ ఇచ్చేస్తున్నాడట. మళ్లీ సేమ్ లొకేషన్ - అట్మాస్ఫియర్ రెడీ చేయడం కష్టం కాబట్టి ఇద్దరూ హీరోలు ఒకేసారి రెడీగా ఉండాలి. కానీ చైతూ రెడీగా ఉన్నా శింబు షూటింగుకి డుమ్మా కొట్టేస్తుండటంతో గౌతమ్ కు చిర్రెత్తుకొచ్చేస్తోంది. చైతూ కూడా శింబు దెబ్బకు ఇబ్బంది పడిపోతున్నాడు.

ఈ విషయంలో గౌతమ్ తన అసహనాన్ని దాచుకోలేదు. ఈ మధ్య ఓ వేడుకలో శింబు పేరెత్తకుండా ఇన్ డైరెక్టుగా ఆ హీరోపై విమర్శలు గుప్పించేశాడు. ‘‘నేను చేస్తున్న కొత్త సినిమా విషయంలో హీరో చాలాసార్లు షూటింగుకి రావట్లేదు. నా మాటలు యూట్యూబ్ లో సెన్సేషన్ అయినా పర్వాలేదు. నా హీరో షూటింగుకి డుమ్మా కొడుతుండటం మాత్రం వాస్తవం’’ అని కుండబద్దలు కొట్టాడు గౌతమ్.