Begin typing your search above and press return to search.

ప్రభాస్ లాగా కొంచెం మారానంటున్న గోపీచంద్..!

By:  Tupaki Desk   |   14 Jun 2022 12:30 PM GMT
ప్రభాస్ లాగా కొంచెం మారానంటున్న గోపీచంద్..!
X
టాలీవుడ్ లోకెరీర్ ప్రారంభం నుంచీ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో మ్యాచో స్టార్ గోపీచంద్. ఈ క్రమంలో 'యజ్ఞం' 'ఆంధ్రుడు' 'గోలీమార్' 'లక్ష్యం' 'రణం' 'లౌక్యం' వంటి బాక్సాఫీస్ హిట్లు అందుకున్నారు. అయితే 'లౌక్యం' తర్వాత సక్సెస్ కోసం దాదాపు ఏడేళ్ల నిరీక్షించిన గోపీచంద్.. గతేడాది 'సీటీమార్' సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని సాధించారు. ఇప్పుడు మారుతితో కలిసి ''పక్కా కమర్షియల్'' చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

దర్శకుడు మారుతి ఎప్పటికప్పుడు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు వినోదాత్మక సినిమాలు రూపొందిస్తారని.. దానికి తన స్టైల్ ఆఫ్ యాక్షన్ కూడా కలిస్తే ఇంకా పెద్ద సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతో 'పక్కా కమర్షియల్' సినిమా చేసినట్లు గోపీచంద్ తెలిపారు. మారుతి చాలా స్పీడని.. అతని శైలికి అలవాటు పడడానికి కొన్ని రోజులు టైం పట్టిందని చెప్పారు. చిన్న చిన్న చేంజెస్ చెప్పడానికి కూడా అవకాశం లేకుండా మారుతి అద్భుతమైన స్క్రిప్టుతో ఈ సినిమాను తీర్చిదిద్దాడని గోపీచంద్ పేర్కొన్నారు.

వ్యక్తిగత జీవితం గురించి పబ్లిక్ కు తెలియకుండా జీవించే సెలబ్రిటీలలో గోపీచంద్ ఒకరు. సోషల్ మీడియాలో తన సినిమాల విషయాలే తప్ప.. ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా ఆయన ఎప్పుడూ షేర్ చేయలేదు. ఇదే అంశంపై గోపీచంద్ స్పందిస్తూ.. వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయడం తనకు ఇష్టం ఉండదని అన్నారు. అలా చేస్తే తనతో పాటుగా కుటుంబ సభ్యుల ప్రైవసీ కూడా పోతుందని తెలిపారు. సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్ అని.. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత మంచిదని చెప్పారు.

''సోషల్ మీడియాను నా సినిమా అప్ డేట్స్ కోసమే ఉపయోగిస్తాను. అప్ డేట్స్ ఇస్తాను.. వ్యక్తిగత విషయాలను షేర్ చేయను. నా ప్రైవేట్ లైఫ్ ను పబ్లిక్ లో పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అలా చేస్తే నా ప్రైవసీ పోతుందని ఫీలింగ్. చాలామంది తమ వ్యక్తిగత విషయాలు కూడా చెబుతుంటారు. అది వారి ఇష్టం. నా వరకు పర్సనల్ విషయాల్ని నేను సోషల్ మీడియాలో పెట్టను. దాని వల్ల నాతో పాటు నా ఫ్యామిలీ ప్రైవసీ కూడా పోతుందని భావిస్తాను'' అని గోపీచంద్ చెప్పుకొచ్చారు.

ఇకపోతే గోపీచంద్ తన రెమ్యునరేషన్ పెంచినట్లు వార్తలు వచ్చాయి. దీని గురించి కూడా డైనమిక్ హీరో మాట్లాడాడు. 'జయం' సినిమాలో నటించినందుకు గాను రూ.11 వేలు మాత్రమే పారితోషకంగా తీసుకున్నట్లు వెల్లడించారు. హిట్టు తర్వాత ఆటోమేటిగ్ గా పారితోషకం పెరుగుతుందంటూ.. 'పక్కా కమర్షియల్' సినిమాకు హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలిపారు.

ఇంటర్వ్యూలలో మాట్లాడే విషయంపై గోపీచంద్ స్పందిస్తూ.. ఈమధ్య తన స్నేహితుడు ప్రభాస్ కూడా ఇంటర్వ్యూల్లో ఎక్కువగా మాట్లాడుతున్నాడని.. తను కూడా ప్రభాస్ లా కొంచెం మారానని అన్నారు. అందుకే కాస్త ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

కాగా, గోపీచంద్ - రాశీ ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ''పక్కా కమర్షియల్'' సినిమా 2022 జూలై 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ & యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. SKN సహ నిర్మాతగా వ్యవహరించారు. మరి గోపీచంద్ కు ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.