Begin typing your search above and press return to search.

ఆ సంగీత దర్శకుడికి ఏమైంది?

By:  Tupaki Desk   |   7 July 2018 10:08 AM GMT
ఆ సంగీత దర్శకుడికి ఏమైంది?
X
గోపీసుందర్.. మలయాళంలో పేరుమోసిన సంగీత దర్శకుడు. మలయాళ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిన ‘బెంగళూరు డేస్’ సహా అనేక మంచి సినిమాలకు చక్కటి ఫీల్ ఉన్న మ్యూజిక్ తో ప్రాణం పోశాడతను. అతడి ప్రతిభ టాలీవుడ్ కు కూడా పాకి.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’లో అవకాశం దక్కింది. ఈ సినిమాలోనూ తనదైన ముద్ర చూపించాడు గోపీ. దీని తర్వాత ‘ఊపిరి’..‘మజ్ను’.. ‘నిన్ను కోరి’ లాంటి సినిమాలు గోపీసుందర్ ముద్రను చూపించాయి. టాలీవుడ్ కు ఒక మంచి సంగీత దర్శకుడు దొరికాడని మ్యూజిక్ లవర్స్ చాలా సంతోషించారు. కానీ ఈ మధ్య గోపీసుందర్ తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. తన శైలికి.. స్థాయికి తగని సినిమాల్ని ఒప్పుకుని పేలవమైన ఔట్ పుట్ తో ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.

‘రాజు గాడు’.. ‘జంబలకిడి పంబ’.. ‘పంతం’.. ‘తేజ్ ఐ లవ్యూ’.. నెల రోజుల వ్యవధిలో రిలీజైన సినిమాలివి. ఈ నాలుగు చిత్రాలకూ గోపీనే సంగీతం అందించాడు. వీటిలో ఏ సినిమాలోనూ సంగీత విలువలు కనిపించవు. ‘తేజ్ ఐ లవ్యూ’ మినహాయిస్తే అసలు ఇంకే సినిమా కూడా గోపీ శైలికి నప్పేది కాదు. అతను రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలకు సూటయ్యే సంగీతం ఇవ్వలేడు. అయినా ఈ సినిమాలకు పని చేశాడు. చాలా సాధారణమైన పాటలు.. నేపథ్య సంగీతంతో నిరాశ పరిచాడు. ‘తేజ్ ఐ లవ్యూ’ లవ్ స్టోరీ కాబట్టి గోపీ తన ముద్ర చూపించే అవకాశముంది. కానీ అందులోనూ ఔట్ పుట్ అంతంతమాత్రమే. ఒకట్రెండు పాటలు మినహా అన్నీ తేలిపోయాయి. నేపథ్య సంగీతంలోనూ ఫీల్ లేకపోయింది. తెలుగులో మొదట్లో చేసిన సినిమాలతో ఆశలు రేకెత్తించిన గోపీ.. ఇప్పుడు ఇలా తయారవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అతను ఇకముందైనా తనకు నప్పే సినిమాలు ఎంచుకుని మనసు పెట్టి సంగీతం అందిస్తాడని ఆశిద్దాం.