Begin typing your search above and press return to search.

ద‌స‌రాకి అక్క‌డ ఎగ్జిబిట‌ర్ల‌కు గుడ్ న్యూస్..

By:  Tupaki Desk   |   12 Oct 2021 11:00 PM IST
ద‌స‌రాకి అక్క‌డ ఎగ్జిబిట‌ర్ల‌కు గుడ్ న్యూస్..
X
దేశ వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరుచుకున్నా..ఇంకా మ‌హ‌రాష్ట్ర‌లో మాత్రం అలాంటి ప‌రిస్థితులు లేవు. మ‌హ‌మ్మారీ రెండ‌వ వేవ్ దెబ్బ‌కు అత‌లాకుత‌ల‌మైన మ‌హ‌రాష్ట్ర‌ ఆ భ‌యం కార‌ణంగానే థియేట‌ర్లను రీఓపెన్ చేసేందుకు ఇప్ప‌టివ‌ర‌కూ అనుమ‌తులివ్వ‌లేదు. అయితే ఎట్ట‌కేల‌కు అక్టోబ‌ర్ 22 నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చ‌ని మ‌హా స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో ఎగ్జిబిట‌ర్లు...నిర్మాత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పాక్షికంగా థియేట‌ర్లు తెరుచున్న‌ప్ప‌టికీ నిబంధ‌న‌లు అతిక్ర‌మ‌ణ క్రింద కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అయితే అక్టోబ‌ర్ 22 నుంచి అలాంటి స‌మ‌స్య‌లేవి ఉండ‌వు. అయితే కొవిడ్ నిబంధ‌న‌ల‌తోనే సినిమాలు ప్ర‌ద‌ర్శించాల్సి ఉంది.

కేవ‌లం 50 శాతం ఆక్యుపెన్సీతోనే సినిమాలు ప్ర‌ద‌ర్శించాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. అలాగే మ‌ల్టీప్లెక్స్ ల్లో సినిమాల‌కు వెళ్లాల‌న్నా.. షాపింగ్ లు చేయాల‌న్నా కొవిడ్ రిపోర్టు త‌ప్ప‌ని స‌రి. అది లేని ప‌క్షంలో సినిమా టిక్కెట్ చూపించాలి. లేక‌పోతే లోప‌లికి ప్ర‌వేశం లేదు. ప్ర‌తీ షో త‌ర్వాత సినిమా థియేట‌ర్ ని శానిటైజ్ చేయాలి. అలాగే ప‌బ్లిక్ ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాలు ఎప్ప‌టిక‌ప్పుడు శుభ్ర‌ప‌ర‌చాలి. బ‌య‌ట నుంచి తినుబండారులు.. పానీయాలు లోప‌లికి తీసుకెళ్ల‌డానికి అనుమ‌తి లేదు. పైవిధంగా ఎంట్రీ గేట్ వ‌ద్ద టెంప‌రేచ‌ర్ ప‌రీక్షించాలి. మ‌రికొన్ని మ‌ల్టీప్లెక్స్ ల్లో కేవ‌లం కోవిడ్ రెండు డోసులు వేసుకున్న వారిని మాత్ర‌మే అనుమ‌తిచ్చేలా చర్య‌లు తీసుకుంటుంది.

ఇవ‌న్నీ గ‌త అనుభ‌వాల్ని దృష్టిలో పెట్టుకుని మ‌హ‌రాష్ట్ర‌ ప్రభుత్వం నిబంధ‌న‌ల్ని మ‌రింత క‌ఠిన‌త‌రం చేసిన‌ట్లు తెలుస్తోంది. అలాగే నైట్ షో విష‌యంలో ప్ర‌భుత్వం ఎలాంటి స్ప‌ష్ట‌త‌నివ్వ‌లేదు. షో వేసుకువాలా? వ‌ద్దా? అన్న దానిపై పున‌రాలోచించి చెబుతామ‌ని వెల్ల‌డించిన‌ట్లు స‌మాచారం. ఏదేమైనా మొత్తానికి ముంబై మ‌ళ్లీ క‌ళ‌క‌ళ‌లాడ‌టం ఖాయం. సినిమాలు రిలీజ్ లేక ముంబై థియేట‌ర్లు కొన్ని నెల‌లుగా వెల వెల బోతున్నాయి. హిందీ సినిమాల‌న్ని ఓటీటీలోనే రిలీజ్ అవ్వాల్సి వ‌స్తోంది. తాజాగా మ‌హా స‌ర్కారు నిర్ణ‌యంతో కాస్త ఉప‌శ‌మ‌నం దొరికింది. థ‌ర్డ్ వేవ్ ముప్పు పూర్తిగా తొల‌గిపోయింది. వంద‌శాతం థియేట‌ర్ల‌లో 100 శాతం ఆక్యుపెన్సీకి అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు లైన్ క్లియ‌ర్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

తాజా ప‌రిణామంతో తెలుగులో రిలీజ్ కి వ‌స్తున్న అతి భారీ పాన్ ఇండియా సినిమాల‌కు ఇది పెద్ద రేంజులోనే క‌లిసి రానుంది. లైగ‌ర్- ఆర్.ఆర్.ఆర్-పుష్ప‌- కేజీఎఫ్ 2 వంటి చిత్రాల‌కు ఇది పెద్ద స్థాయిలో వ‌ర్క‌వుట‌వుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.