Begin typing your search above and press return to search.

అతిథికి వాత‌లు! జ‌క్క‌న్న‌కు ఇది త‌గునా?

By:  Tupaki Desk   |   1 Feb 2022 2:35 PM GMT
అతిథికి వాత‌లు! జ‌క్క‌న్న‌కు ఇది త‌గునా?
X
ఇది చాలా వింతైన ప‌రిస్థితి. త‌మ సినిమా ప్ర‌చారానికి పిలిచిన అతిథికి జ‌క్క‌న్న టీమ్ వాత‌లు పెట్టించింది. అదెలాగంటారా? డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే. నిన్న‌టికి నిన్న ఆక‌స్మికంగా ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ తేదీని జ‌క్క‌న్న టీమ్ ప్ర‌క‌టించింది. మార్చి 25 తేదీని లాక్ చేస్తున్నామ‌ని పాన్ ఇండియా కేట‌గిరీలో తెలుగు-త‌మిళం-హిందీ స‌హా ప‌లు భాష‌ల్లో విడుదల చేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు.

అయితే అనూహ్యంగా ఆర్.ఆర్.ఆర్ త‌మిళం ప్ర‌మోష‌న్స్ కి స‌హ‌క‌రించిన శివ‌కార్తికేయ‌న్ కి ఇది మింగుడుప‌డ‌ని వ్య‌వ‌హారంగా మారింది. మార్చి 25న ఆర్.ఆర్.ఆర్ విడుద‌ల‌ను అత‌డు ఏమాత్రం ఊహించ‌నిది. ఎందుకంటే అదే రోజున శివ కార్తికేయన్ DON కూడా విడుదల అవుతుంది. కొత్త తేదీ ప్ర‌క‌ట‌న‌ RRR తెలుగు అభిమానులను ఆనందపరిచ‌నా తమిళ మీడియాని అభిమానులను నిరాశ‌ప‌రిచింది. రాజ‌మౌళి నిర్ణ‌యంతో అంతా క‌ల‌త‌కు గుర‌య్యారు. నిజానికి RRR నిర్మాతలు చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం శివ కార్తికేయన్ ను ఆహ్వానించారు. అతిథిగా ఆహ్వానించి ఇప్పుడు అత‌డికే ఎస‌రు పెట్టారు! అన్న కామెంట్లు మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి. ఇది స‌రికాద‌ని రాజ‌మౌళికి సూచిస్తున్నారు.

రాజమౌళి ప్లానింగ్ పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజా ప‌రిణామంతో శివకార్తికేయ‌న్ ఖచ్చితంగా రేసు నుండి తప్పుకుంటార‌ని మార్చి 25 లోపు లేదా తర్వాత తమ చిత్రాన్ని విడుదల చేస్తారని ఒక విషయం స్పష్టంగా అర్థ‌మ‌వుతోంది. శివ కార్తికేయన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా డాన్. డాక్ట‌ర్ ఇటీవ‌ల విడుద‌లైంది. ఆ త‌ర్వాత మంచి హిట్టు కొట్టాల‌న్న క‌సి అత‌డిలో ఉంది. మార్చి 25 తన చిత్రాన్ని విడుదల చేయడానికి సరైన వేసవి సమయం అని భావించినా కానీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ రూపంలో త‌న‌కు ఇబ్బంది ఎదురైంది.

ఆస‌క్తిక‌రంగా `డాన్` చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. తమిళనాడులో RRRని కూడా విడుదల చేస్తోంది ఈ సంస్థ‌. కానీ ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కోసం డాన్ చిత్రాన్ని వాయిదా వేయాల్సిన ప‌రిస్థితి ఉంది. ఏదేమైనా జ‌క్క‌న్న‌కు ఇది త‌గునా? అంటూ శివ‌కార్తికేయ‌న్ అభిమానుల నుంచి ప్ర‌శ్న ఎదురైంది.