Begin typing your search above and press return to search.

బాధ్యతతో సినిమాలు చేస్తే మంచి రోజులు వస్తాయి: సురేష్ బాబు

By:  Tupaki Desk   |   3 May 2020 7:00 AM IST
బాధ్యతతో సినిమాలు చేస్తే మంచి రోజులు వస్తాయి: సురేష్ బాబు
X
కరోనా క్రైసిస్ ప్రభావం సినిమా ఇండస్ట్రీపై తీవ్రంగానే ఉంది. ఈ విషయం ఎవరైనా ఒప్పుకుంటారు. అయితే సినీ రంగం మునుపటి కళను సంతరించుకుంటుందా? ప్రస్తుతం ఓటీటీలకు అలవాటు పడుతున్న ప్రేక్షకులు థియేటర్లు రీ ఓపెన్ చేసిన తర్వాత గతంలో మాదిరిగానే సినిమాలు చూసేందుకు వస్తారా? వసూళ్లపై ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? చాలా మందిలో ఇలాంటి ప్రశ్నలు మెదులుతున్నాయి. ఈ విషయంపై సీనియర్ నిర్మాత సురేష్ బాబు స్పందించారు.

గత కొన్ని వారాలుగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారని.. అయితే ఒక్కసారి కరోనావైరస్ కు వ్యాక్సీన్ వచ్చిందంటే ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తారని చెప్పారు. "బాధ్యతతో.. క్రమశిక్షణతో సినిమాలను జాగ్రత్తగా తెరకెక్కిస్తే తెలుగు సినిమాకు మళ్లీ స్వర్ణయుగం వస్తుంది" అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతే కాదు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా నిర్మాణంలో వృధా ఖర్చులు తగ్గాలని అన్నారు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని.. మిగతా సినిమాలకు ఒటీటీలు మంచి ఆప్షన్ గా మారతాయని చెప్పారు.

అంతే కాదు.. సినిమా బడ్జెట్లలో ఎక్కువ శాతం పారితోషికాలపై ఖర్చుపెట్టాల్సి వస్తోందని.. అందుకే నటీనటులు.. టెక్నిషియన్లు తమ పారితోషికాలు తగ్గించుకోవాలని.. నిర్మాతలకు తోడుగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. సురేష్ బాబు ఆలోచనలు బాగానే ఉన్నాయి కానీ అవి ఆచరణలోకి వస్తాయా అనేది తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.