Begin typing your search above and press return to search.

వైరల్: కింగ్ కాంగ్ కోసం అభిమాన సంఘాలు..!

By:  Tupaki Desk   |   26 March 2021 5:37 AM GMT
వైరల్: కింగ్ కాంగ్ కోసం అభిమాన సంఘాలు..!
X
స్టార్ హీరోహీరోయిన్లు మొదలుకొని నిన్న మొన్న వచ్చిన కుర్ర హీరోల వరకు అందరికి ఫ్యాన్స్ ఉన్నారు.. ఫ్యాన్స్ అసోసియేషన్స్ కూడా ఉన్నాయి. అలానే సినిమాల్లో కనిపించే క్యారెక్టర్స్ ను జంతువుల పాత్రలను కూడా అమితంగా అభిమానించే వారు ఉన్నారు. ముఖ్యంగా సినిమా కోసం సృష్టించిన స్పైడర్ మ్యాన్ - బ్యాట్ మ్యాన్ - ఐరన్ మ్యాన్ లతో పాటుగా కింగ్ కాంగ్ పాత్రలకు అభిమానులు కాస్త ఎక్కువగా ఉన్నారు. అయితే ఇప్పుడు కొత్తగా 'కింగ్ కాంగ్' కు అభిమాన సంఘాలు కూడా ఏర్పడటం విడ్డూరంగా అనిపిస్తోంది.

హాలీవుడ్ మూవీ 'గాడ్జిల్లా వెర్స‌స్ కాంగ్' బుధవారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఇండియాలో కూడా పెద్ద ఎత్తున రిలీజైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ నేప‌థ్యంలో విజ‌య‌వాడ‌లో ఓ థియేట‌ర్ వద్ద 'కింగ్ కాంగ్' అసోసియేషన్ పేరిట ఓ ఆస‌క్తిక‌ర పోస్ట‌ర్ వెల‌సింది. 'కింగ్ కాంగ్ యూత్ ఫోర్స్' - 'అఖిల భార‌త తెలుగు కింగ్ కాంగ్ యువ‌త‌-విజ‌య‌వాడ' అంటూ పోస్ట‌ర్స్ అంటించారు. 'గాడ్జిల్లా vs కాంగ్' చిత్రం విడుద‌ల సంద‌ర్భంగా విచ్చేయుచున్న మా అభిమాన జంతువు కింగ్ కాంగ్ అభిమానుల‌కు, థియేట‌ర్ యాజ‌మాన్యానికి ఇవే మా శుభాకాంక్ష‌లు అంటూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు.

అలానే 'వరంగల్ కాంగ్ అభిమానుల సంఘం' అంటూ వరంగల్ లో కూడా ఓ ఫ్యాన్స్ అసోసియేషన్ కూడా ఏర్పాటు అయింది. మరి వీళ్లంతా జ‌నాల దృష్టిని ఆక‌ర్షించ‌డానికే చేశారేమో కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 'గాడ్జిల్లా vs కాంగ్' థియేటర్స్ వద్ద పబ్లిక్ టాక్ కూడా ఇలానే ఉంది. సినిమాలో కాంగ్ దే పైచేయి అంటూ కింగ్ కాంగ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్యాన్స్ అసోసియేషన్స్ - కాంగ్ పబ్లిక్ టాక్ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.