Begin typing your search above and press return to search.

రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వండి ఏజెంట్..!

By:  Tupaki Desk   |   17 Jun 2022 4:06 AM GMT
రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వండి ఏజెంట్..!
X
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంతో హిట్టు కొట్టిన యూత్ కింగ్ అఖిల్ ప్రస్తుతం "ఏజెంట్" అనే స్పై యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అక్కినేని అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2022 ఆగస్ట్ 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ తేదీకి రావడం లేదని టాక్ వినిపిస్తోంది.

స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న "ఏజెంట్" చిత్రంలో అఖిల్ ఓ గూఢచారిగా కనిపించనున్నారు. ఇప్పటి వరకు లవర్ బాయ్ తరహా పాత్రల్లో కనిపించిన యువ హీరో.. ఈసారి యాక్షన్-ప్యాక్డ్ రోల్ లో కనువిందు చేయనున్నారు. సిక్స్ ప్యాక్ తో పాటు స్టైలింగ్ మరియు బాడీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి సరికొత్తగా మేకోవర్ అయ్యాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి.

ఇక్కడి దాకా అంతా బాగానే ఉన్నా 'ఏజెంట్' కు సంబంధించిన షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందట. అందుకే విడుదల ఆలస్యం కానుందని అంటున్నారు. ఈ టాక్ వచ్చి కూడా చాలా రోజులే అయింది. కానీ మేకర్స్ ఇంతవరకు ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ సినిమా ఇండిపెండెన్స్ డే వీక్ లో వస్తుందా రాదా అనేది తెలియక అక్కినేని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే 'ఏజెంట్' రావాలనుకున్న తేదీకి అర డజనుకు పైగా సినిమాలు విడుదల ప్లాన్ చేసుకున్నాయి. నితిన్ 'మాచర్ల నియోజకవర్గం'- సమంత 'యశోద' - విక్రమ్ 'కోబ్రా' - బెల్లంకొండ బ్రదర్ 'స్వాతిముత్యం' వంటి సినిమాలు లైన్ లో ఉన్నాయి. అలానే అఖిల్ సోదరుడు అక్కినేని నాగచైతన్య హిందీ డెబ్యూ మూవీ 'లాల్ సింగ్ చద్దా' కూడా అప్పుడే రాబోతోంది. ఇన్ని సినిమాల మధ్య రిలీజ్ ప్లాన్ చేసుకోవడం సరైన నిర్ణయం అనిపించుకోదు.

అయితే లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం 'ఏజెంట్' సినిమాని దసరా బరిలో నిలపాలని నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే అదే సీజన్ ను చిరంజీవి 'గాడ్ ఫాదర్' - బాలకృష్ణ NBK107 టార్గెట్ చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ లో కొన్ని డేట్స్ ఉన్నాయి కానీ.. మంచి సీజన్ ను మిస్ చేసుకోవాల్సి వస్తుంది.

ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా 'ఏజెంట్' రిలీజ్ డేట్ ని లాక్ చేసి.. టీజర్ ని వదలాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. మరి త్వరలోనే దీనిపై మేకర్స్ స్పష్టత ఇస్తారేమో చూడాలి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సరెండర్2సినిమా బ్యానర్స్ పై సుంకర రామబ్రహ్మం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ఏజెంట్' చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వక్కంతం వంశీ కథ - స్క్రీన్ ప్లే అందించగా.. హిప్ హాప్ తమిజా సంగీతం సమకూరుస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.